పారిశ్రామిక ప్రగతి పరుగులు | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక ప్రగతి పరుగులు

Mar 22 2026 2:06 AM | Updated on Mar 22 2026 2:06 AM

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : తలసరి ఆదాయం (పర్‌ క్యాపిటా ఇన్‌కం) పెరుగుదలలో సంగారెడ్డి జిల్లా దూసుకుపోతోంది. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాను సైతం వెనక్కినెట్టి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. తొలి, రెండో స్థానాల్లో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలు ఉండగా, సంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో ఉంది. అలాగే జిల్లా స్థూల వస్తుత్పత్తిలోనూ సంగారెడ్డి రాష్ట్రంలోనే నాలుగోస్థానంలో ఉండటం గమనార్హం. ఒక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో సూచికల్లో తలసరి ఆదాయం ప్రధానమైనది. ఈ తలసరి ఆదాయం పెరుగుదలలో జిల్లా ప్రగతి వైపు పయనించడం శుభసూచికమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా సోషియో ఎకనమిక్‌ అవుట్‌ నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో ఈ తలసరి ఆదాయంతోపాటు పారిశ్రామిక ప్రగతిలో సంగారెడ్డి జిల్లా దూసుకుపోతున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లా ఒక్కోవ్యక్తి తలసరి ఆదాయం రూ.3.94 లక్షలుగా ప్రభుత్వం ప్రకటించింది. మొదటి స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా రూ.11.29 లక్షలు ఉండగా, రెండోస్థానంలో ఉన్న హైదరాబాద్‌ జిల్లాలో తలసరి ఆదాయం రూ.4.79 లక్షలు, నాలుగోస్థానంలో ఉన్న మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా తలసరి ఆదాయం రూ.3.81 లక్షలు ఉంది.

ఫార్మా, రక్షణ రంగ ఉత్పత్తుల

ఎగుమతులే కారణం

సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా దూసుకుపోతోంది. ఫార్మా, ఇంజనీరింగ్‌మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌, రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల్లోని ఉత్పత్తులు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ప్రధానంగా ఫార్మా, బల్క్‌డ్రగ్‌ ఉత్పత్తులు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్‌ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఈ ఎగుమతులు ఏటా పెరుగుతుండటంతో జిల్లా స్థూల ఉత్పత్తి పెరుగుతోంది. తద్వారా తలసరి ఆదాయం పెరుగుదలకు కారణమవుతోందనే అభిప్రాయం ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర మొత్తం ఎగుమతుల్లో ఐటీ, తర్వాత స్థానం ఫార్మా ఉత్పత్తులే ఉంటాయి. ఈ ఫార్మా ఉత్పత్తిల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో ఉండటంతో తలసరి ఆదాయంలో జిల్లా మూడో స్థానంలో నిలవడానికి కారణమని ఆర్థిక నిపుణులు లెక్కిస్తున్నారు. ఒక ప్రదేశంలో జరిగిన ఉత్పత్తి విలువను ఆ ప్రాంతంలో ఉన్న జనాభాతో భాగించి తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు.

2.68 లక్షల మందికి ఉపాధి

పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్న వారిలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉంది. 2025 డిసెంబర్‌ నాటికి జిల్లాలో ఉన్న 2,187 పరిశ్రమల్లో 2,68,735 మంది ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్న వారు ఉన్నట్లు లెక్కగట్టింది. తొలిస్థానంలో మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా ఉంది. ఈ జిల్లాలో 4,095 పరిశ్రమలుండగా, 2.96లక్షల మంది ఉద్యోగులు, ఉపాధి పొందుతున్న వారు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తంగా 13.01 లక్షల మంది పరిశ్రమలతో ఉపాధి పొందుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

3వ స్థానంలో

తలసరి ఆదాయం

మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాను వెనక్కినెట్టిన సంగారెడ్డి

పరిశ్రమల ఉద్యోగాల్లోజిల్లా రెండో స్థానం

జిల్లా స్థూల ఉత్పత్తిలోనూ పురోగతి

పారిశ్రామిక ఉత్పత్తులే కారణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement