పటాన్‌చెరు: బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి కుక్కే సుబ్రహ్మణ్యస్వామి, ఉడుపి, మురుడేశ్వర, గోకర్ణ మీదుగా 25వ తేదీన గోవాకు సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మోహన్‌రావు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వీకెండ్‌లలో గోవాకు ఒక్కరి రూ.6,150 టికెట్ ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక కాలనీలో కనీసం 30మంది విహారయాత్రలకు, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బీఓసీ కింద బస్సులు నడపనున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకోసం 9063401072 సంప్రదించాలని సూచించారు.
సిరిపురంలో
బ్యాంకు ఏర్పాటుకు హామీ
హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం సిరిపురం గ్రామంలో నూతనంగా బ్యాంకు ఏర్పాటుకు ఎంపీ రఘునందన్‌రావు సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు నాగప్రభుగౌడ్ తెలిపారు. హత్నూర మండలంలోని పలు గ్రామాల బీజేపీ నాయకులు పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నాగప్రభుగౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఎంపీ రఘునందన్‌రావును కలిసినట్లు తెలిపారు. సిరిపురం గ్రామంతోపాటు పరిసర గ్రామాల ప్రజలకు బ్యాంకు లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్న విషయం ఎంపీ రఘునందన్‌రావు దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే బ్యాంకు ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడతానని ఎంపీ హామీనిచ్చినట్లు వెల్లడించారు.
సంగమేశ్వర బసవేశ్వరకు కేటాయింపులేవి?
నియోజకవర్గంలో అధ్వానంగా రోడ్లు
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
జోగిపేట(అందోల్): బడ్జెట్లో అందోల్ నియోజకవర్గం చెందిన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. జోగిపేటలో ఆయన శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ...గత బీఆర్‌ఎస్ హాయాంలో సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నాలు చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రెయిన్‌బో స్కూల్‌పై
చర్యలు తీసుకోవాలి
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అర్జున్
పటాన్‌చెరుటౌన్: అధిక ఫీజులు వసూలు చేస్తున్న రెయిన్ బో ఇంటర్నేషనల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అర్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణం లోని శ్రామిక్ భవన్‌లో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ...అమీన్‌పూర్ డివిజన్ బీరంగూడ లోని రెయిన్ బో ఇంటర్నేషనల్ స్కూల్‌లో యాజమాన్యం అధిక ఫీజులు వసూళ్లు చేయటం దారుణమన్నారు. అధిక ఫీజుల వసూళ్లపై తల్లిదండ్రుల ఆందోళనే ఇందుకు నిదర్శనమన్నారు.


