న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు
సిద్దిపేటఅర్బన్: రికార్డులను తారుమారు చేసి అక్రమంగా తమ స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని రంగాధాంపల్లికి చెందిన రైతులు ఆరోపించారు. శుక్రవారం వివాదంలో ఉన్న భూమి వద్ద విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు. 65 ఏళ్లుగా తమ కుటుంబమే భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోందన్నారు. తమ కుటుంబానికి చెందిన కొంతమంది కొన్నేళ్ల క్రితం భూమిని అమ్ముకొని వెళ్లి, ఇప్పుడు మళ్లీ స్థలం కోసం తమతో గొడవకు దిగుతున్నారని తెలిపారు. సర్వే నం.974, 975, 978, 979, 988, 1005, 1006లో సుమారు 8 ఎకరాల స్థలంలో తమ కుటుంబమే కబ్జాలో ఉందన్నారు. తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. తమ వద్ద స్థలానికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని, ఈ మధ్యకాలంలో తమ పేరుపై ఉన్న భూ రికార్డులను తొలగించారని అన్నారు. కొద్దిరోజుల క్రితం రియల్ ఎస్టేట్ చేస్తున్న కొంతమంది అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని, దీనిపై న్యాయ విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.


