● మధ్యాహ్న భోజనం అమలు నిర్ణయం హర్షణీయం
● జీజేసీపీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి
సిద్దిపేట ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సంఘం(జీజేసీపీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించడాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ విద్య బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను అందించడం సంతోషించాల్సిన అంశమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఎంతో మంది పేద విద్యార్థుల ఆకలి తీరుతుందన్నారు. ఫలితంగా విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కూచంగారి శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ జ్యోతి, గంగాధర్, దేవస్వామి, శివకోటి, నాయకులు శశిధర్‌రెడ్డి, శ్రీనివాస్, దేవయ్య, సదానందం, మధుసూదన్‌రావుతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.


