సిద్దిపేటఎడ్యుకేషన్: పట్టణీకరణ, పారిశ్రామీకీకరణ, ఫెస్టిసైడ్స్ వాడకం తదితర పరిస్థితుల మూలంగా ప్రస్తుతం పిచ్చుకలు అంతరించిపోయే దశలో ఉన్నాయని, వాటిని కాపాడుకోవాలని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పేర్కొన్నారు. కళాశాల జంతుశాస్త్ర విభాగం, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పిచ్చుకలు పంటలకు హాని కలిగించే కీటకాలను ఆహారంగా తీసుకొని, పైరును రక్షిస్తాయన్నారు. పిచ్చుకలను రక్షించుకునేందుకు వాటికి కావాల్సిన నీరు, గూడు, ఆహారాన్ని కల్పించాలని సూచించారు. పిచ్చుకలను, ప్రకృతిని కాపాడేందుకు విద్యార్థులు ముందుకు రావాలని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి కోరారు. అనంతరం కళాశాల అవరణలో చెట్లకు పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేసి, ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏకోక్లబ్ కన్వీనర్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


