సింగూరుకు రూ.45.39 కోట్లు | - | Sakshi
Sakshi News home page

సింగూరుకు రూ.45.39 కోట్లు

Mar 21 2026 6:41 AM | Updated on Mar 21 2026 6:41 AM

హెచ్‌ఎండీఏ నిధులతోరేడియల్‌ రోడ్లకు మోక్షం! ట్రిపుల్‌ ఆర్‌కు రూ.1,525 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లా అంశాలకుకేటాయింపులు

హెచ్‌ఎండీఏ రేడియల్‌ రోడ్లకు నిధులు

బడ్జెట్‌ ప్రసంగంలో మహిళా

పెట్రోల్‌బంక్‌ల ప్రస్తావన

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు రూ.45.39 కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి రూ.22 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని ఏకై క మధ్యతరహా ప్రాజెక్టుకు అత్తెసరు కేటాయింపులే దక్కాయి. సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌ జంటనగరాలతోపాటు, ఉమ్మడి మెదక్‌ జిల్లాకు తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం రూ.60 కోట్లతో కట్టబలోపేతం పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉందని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ హెచ్చరికల మేరకు కట్టబలోపేతం పనులు చేస్తున్నారు. దీంతోపాటు ఈ ప్రాజెక్టు కాలువల లైనింగ్‌ పనులు కూడా సాగుతున్నాయి. రూ.143 కోట్లు ఈ పనులకు మంజూరయ్యాయి. ఈ పనులకు కలిపి 2026–27 సంవత్సరానికి మొత్తం రూ.45.39 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. అలాగే ఖేడ్‌ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు నిర్వహణ, కాలువల ఆధునీకరణ పనులకు రూ.4.51 కోట్లు కేటాయించినట్లు నీటిపారుదలశాఖవర్గాలు పేర్కొంటున్నాయి.

నిమ్జ్‌ భూసేకరణకు నిధులు

హీరాబాద్‌ నిమ్జ్‌ (జాతీయ పెట్టుబడులు, మాన్‌ఫ్యాక్చరింగ్‌ జోన్‌)కు ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు జరపడం గమనార్హం. జాతీయ పారిశ్రామిక కారిడార్‌ల అభివృద్ధిలో భాగంగా ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తోంది. ఈ నిమ్జ్‌ భూసేకరణకు ఈ బడ్జెట్‌లో రూ.96.50 కోట్లు కేటాయించింది. ఈ నిమ్జ్‌ కోసం మొత్తం 3,245 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విడతలవారీగా భూసేకరణ ప్రక్రియ చేపట్టగా, ఇప్పటికే సుమారు 1,400 ఎకరాల భూమిని సేకరించారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, మౌలిక సదుపాయాల కల్పన పనులకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు జరపడం గమనార్హం. కాగా, గతేడాది 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ నిమ్జ్‌కు రూ.125.47 కోట్లు కేటాయించినప్పటికీ పూర్తిస్థాయిలో నిధుల విడుదల జరగలేదని నిమ్జ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

పెట్రోల్‌బంక్‌ ప్రత్యేక ప్రస్తావన

రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న మహిళా పెట్రోల్‌బంక్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళా సాధికారతకు తమ ప్రజాప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పిన భట్టి సంగారెడ్డి బైపాస్‌ రోడ్డులో మహిళలు నిర్వహిస్తున్న పెట్రోల్‌బంక్‌తోపాటు, నారాయణపేటలో మహిళలు పెట్రోల్‌బంక్‌లను విజయవంతంగా నడుపుతున్నారని పేర్కొన్నారు.

రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు..

బడ్జెట్‌లో రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు రూ.1,525కోట్లు కేటాయించారు. సంగారెడ్డితోపాటు, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో నిర్మిస్తున్న ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుకు నిధుల కేటాయింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ పనులకు శ్రీకారం చుడతారా అనేది వేచి చూడాల్సిందే.

హెచ్‌ఎండీకు భారీగా నిధులు

ఈ బడ్జెట్‌లో హెచ్‌ఎండీఏ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో రూ.43వేల కోట్లు కేటాయించారు. సంగారెడ్డితోపాటు, ఎనిమిది మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కాగా, ఇప్పటికే హెచ్‌ఎండీఏ నిధులతో సంగారెడ్డి మున్సిపాలిటీలో బైపాస్‌రోడ్డు విస్తరణ, పట్టణంలో సీసీరోడ్లు వంటి పనులు జరుగుతున్నాయి. అలాగే ఓఆర్‌ఆర్‌ నుంచి ట్రిపుల్‌ఆర్‌కు కలుపుతూ సంగారెడ్డి మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌, రేడియల్‌రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఈ బడ్జెట్‌లో భారీ కేటాయింపుల నేపథ్యంలో ఈ పనులకు అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement