చిరుత పాదముద్రల గుర్తింపు
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని శాలిపేట అటవీ ప్రాంతంలో చిరుత, చిరుతపిల్లల పాదముద్రలను గుర్తించినట్లు బీట్ ఆఫీసర్ ప్రశాంత్ తెలిపారు. శుక్రవారం మండలంలోని శాలిపేట అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల లెక్కింపులో భాగంగా చిరుత పాదముద్రలను గుర్తించారు. రెండు రోజుల క్రితం గజగట్లపల్లి గ్రామశివారులోని అటవీ ప్రాంతంలోని చెరువులో కూడా ఇదే చిరుత పాద ముద్రలను గుర్తించినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం చిరుత సంచరించినట్లు తెలిపారు. అయితే గజగట్లపల్లి, శాతలిపేట, ఖాజాపూర్, వెంకటాపూర్, గుట్టకిందిపల్లి, తిమ్మనగర్, భూపతిపూర్ గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో కొన్నాళ్లుగా చిరుత సంచారం ఉందన్నారు. సమీప గ్రామాల ప్రజలు రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లొద్దని జాగ్రత్త పడాలని సూచించారు.


