సేంద్రియ విధానంలో సాగు చేయాలి
అల్గోల్‌లో పాతపంటల జాతర
జహీరాబాద్: రసాయన ఎరువులను పూర్తిగా విస్మరించాలని, సేంద్రియ విధానంలో పంటలు పండించాలని డీడీఎస్ ఈడీ దివ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని అల్గోల్ గ్రామంలో పాతపంటల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎద్దుల బండ్లలో చిరుధాన్యాలను ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రూపు సమావేశంలో ఈడీ దివ్య మాట్లాడుతూ... రైతులు ఎర్ర నేలల్లో పాత పంటలు పండించి లబ్ధి పొందుతున్నారన్నారు. తినడానికి సరిపడా తిండి గింజలు పొందడంతో పాటు మిగిలినవి అమ్ముకుంటున్నారని తెలిపారు. రసాయనాలతో పండించినవి తినడం వల్లే మనుషులు బీపీ, షుగర్ తదితర వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. పశు వధశాల నుంచి వదులుతున్న కలుషిత జలాల వల్ల పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉందని, సమస్యను పరిష్కరించాలని పలువురు రైతులు కోరారు. సమావేశంలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ బుజ్జమ్మ, రైతులు చంద్రకాంత్‌రెడ్డి, ప్రభాకర్, మారుతి, పెంటప్ప, అనూశమ్మ, చంద్రమ్మ, మొగులమ్మ, డీడీఎస్ ప్రతినిధులు బాలయ్య, నర్సింహులు పాల్గొన్నారు.


