రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి మృతి
హుస్నాబాద్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మారెడ్డి కథనం ప్రకారం... పందిల్ల గ్రామానికి చెందిన బొమ్మగాని కనకయ్య(56)గురువారం హుస్నాబాద్‌లో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి పందిల్ల కాటన్‌మిల్లు వద్ద ద్విచక్ర వాహనంపై నుంచి పడి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కనకయ్యను హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన కనకయ్య శుక్రవారం ఉదయం మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు తలలో రక్తం గడ్డ కట్టినట్లు చెప్పారు. మృతుడి భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


