పెండింగ్ వేతనాల కోసం ధర్నా
జహీరాబాద్ టౌన్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కోహీర్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికులకు మూడు నుంచి ఏడు నెలల వరకు వేతనాలు రావాల్సి ఉందన్నారు. చాలీచాలని వేతనంతో పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందన్నారు. బకాయి వేతనాలతో పాటు యూనిఫాం, గ్లౌస్‌లు, సబ్బులు, నూనె ఇవ్వాలని కోరారు.ఈ మేరకు ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో యూనియన్ నాయకులు సురేశ్, ఆనంద్, నర్సింహులు, ఖలీల్, అంజన్న పాల్గొన్నారు.


