యూరియా.. ఆన్‌లైన్
ఫర్టిలైజర్ యాప్‌ద్వారా బుకింగ్
యూరియా బస్తాల కోసం పడిగాపులు, చెప్పులు, పాసు పుస్తకాలు క్యూలైన్‌లో పెట్టే కష్టాలు తప్పనున్నాయి. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 29 నుంచి యాప్ బుకింగ్ అమలులోకి వచ్చింది. ప్రస్తుతం మ్యానువల్‌గా కొనసాగుతున్నా మరో వారం రోజుల్లో జిల్లాలో యాప్ బుకింగ్ ద్వారా పొందాల్సి ఉంటుంది.
– నారాయణఖేడ్
గత వానాకాలం సీజన్‌లో ఎదురైన యూ రియా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లెక్క ప్రకారం యాసంగిలో రైతులకు ఎరువులు అందించబోతున్నారు. తీసుకున్న రైతులు మళ్లీ తీసుకోకుండా యాప్‌లో బుక్ చేసుకున్న ప్రకారం ఎరువులు తీసుకునే ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో సుమారు 380 వరకు ఫర్టిలైజర్ దుకాణాలు ఉన్నాయి. 3.50 లక్షల మంది రైతులు 7లక్షల ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. కాగా ఫర్టిలైజర్ బుకింగ్‌కు స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి కావడంతో క్షేత్రస్థాయిలో అన్నదాతలకు ఇబ్బందులు తప్పేలా లేదు. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
ఎప్పటికప్పడు అప్‌డేట్
జిల్లాలో సహకార సంఘాలు, ఎరువుల డీలర్ల ద్వారా యూరియా సరఫరా అవుతున్నందున ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో సొసైటీలు, డీలర్ల సమాచారంతో పాటు వారికి కేటాయించిన యూరియా వివరాలను కూడా అప్‌డేట్ చేస్తారు. దీంతో రైతులు సెల్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ పేరు, పట్టా పాసుపుస్తకం నంబరు, ఇతర వివరాలు అందిస్తే అప్పటికే యాప్ ద్వారా రైతులు తమకు కావాల్సిన యూరియాను ఏ డీలర్‌వద్ద ఉంటే ఆ డీలర్ వద్ద కొనుగోలు చేయొచ్చు. కౌలు రైతులు కూడా యూరియా పొందే అవకాశం ఉంది. ఎకరానికి వరికి రెండున్నర బస్తాలు, మొక్క జొన్న, చెరుకుకు నాలుగు బస్తాలు, మిర్చి రైతుకు 5 బస్తాలు కేటాయిస్తున్నారు. ఎకరంలోపు ఉన్న రైతుకు మొత్తం కేటాయిస్తారు. 3 ఎకరాలలోపు రైతులకు రెండు విడతల్లో విక్రయిస్తారు. 3 నుంచి 5 ఎకరాల్లోపు ఉంటే మూడు విడతల్లో, ఐదెకరాలు ఆపైన ఉన్న రైతులకు నాలుగు విడతలుగా యూరియాను అందిస్తారు. విడత, విడతకు 15 రోజులు గ్యాప్ ఉంటేనే మళ్లీ బుకింగ్ అవుతుంది. యాప్‌లో బుకింగ్ చేసుకునే రైతులకు ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ఒకసారి బుకింగ్ చేసుకున్న తర్వాత 48 గంటల వరకు వీలును బట్టి ఎరువుల బస్తాలను కొనుగోలు చేయొచ్చు.
పరిపడా నిల్వలు..
రైతులు సాగు చేస్తున్న పంటలకు సరిపడా ఎరువులను సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,852 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. రైతులకు ఇబ్బందులు కలుగకుండా వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్ల సమన్వయంతో యూరియా సరఫరా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య వ్యవసాయ శాఖ మంత్రితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. గతంలో రైతులు పంటల సీజన్ ప్రారంభం కాగానే ఒకేసారి ఎరువులను కొనుగోలు చేసి అవసరమైన మేరకు ఇంట్లో నిల్వలు చేసుకునే వారు. దీంతో వానాకాలం, యాసంగి సీజన్ ప్రారంభంలో ఎరువుల కోసం ఎగబడి కొనుగోలు చేసేవారు.దీంతో ఫర్టిలైజర్ షాపుల వద్ద భారీ క్యూలైన్లు, బారులు తీరడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తేవి. క్యూలైన్‌లో నిలబడే ఓపిక లేక కొందరు పట్టాపాసుపుస్తకాలు, చెప్పులను క్యూలైన్‌లో ఉంచేవారు. కొన్ని సందర్భాల్లో ఎరువుల జాప్యంపై ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. ఇలాంటి పరిస్థితికి చెక్ పేట్టేందుకే ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రైతుల కష్టాలకు చెక్
క్యూలైన్, ఆందోళనలకు మంగళం
48 గంటల వరకు ఎరువులుతీసుకునే సదుపాయం
స్టాకు వివరాలూ తెలుసుకోవచ్చు
స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి
యూరియా.. ఆన్‌లైన్


