అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Dec 31 2025 9:50 AM | Updated on Dec 31 2025 9:50 AM

 అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాలోని అన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం వంద శాతంగా ఉండాలని, వివిధ సబ్జెక్టులలో వెనకబడిన విద్యార్థులను ముందుగానే గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పాఠశాలల్లో ఈజీఎస్‌ కింద మంజూరైన మరుగుదొడ్లన్నింటినీ వెంటనే గ్రౌండింగ్‌ చేయాలని, రెండు రోజుల్లో ఏజెన్సీలను గుర్తించి, రెండు నెలలలోపు అన్ని టాయిలెట్లు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అలాగే స్కూల్‌ మెయింటెనెన్స్‌, శానిటేషన్‌ గ్రాంట్‌లను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. విద్యార్థులకు ఇండస్ట్రియల్‌ విజిట్స్‌, ఎక్స్‌పోజర్‌ విజిట్స్‌ నిర్వహించడంతో పాటు క్రీడా పరికరాల కొనుగోలు, క్రీడల నిర్వహణ వంటి అంశాలకు నిధులను వినియోగించాలని సూచించారు. ఈఐఎస్‌ పాఠశాలల్లో ఈజీఎస్‌ కింద చేపడుతున్న టాయిలెట్లు, కిచెన్‌ షెడ్లు, మరమ్మతుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంఆర్‌ సెంటర్లకు ఒక ప్రొజెక్టర్‌, స్క్రీన్‌, స్పీకర్‌ యూనిట్‌ను అందిస్తున్నామని, వాటితో మొదటగా రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రేరణాత్మక సినిమాలు ప్రదర్శించి స్ఫూర్తి కలిగించాలన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 52 రోజుల ప్రత్యేక తరగతుల కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్‌డీఓ జ్యోతి, డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓలు, ఈడబ్ల్యూడీఐసీ, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, హెడ్‌మాస్టర్లు, సెక్టర్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

నిరంతరం యూరియా సరఫరా

సంగారెడ్డి జోన్‌ : జిల్లాలో యూరియా సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం జరుగుతుందని కలెక్టర్‌ ప్రావీణ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సహకార సంఘాలు, అగ్రో కేంద్రాలు, డీపీఎంస్‌ కేంద్రాలు, ప్రైవేట్‌ డీలర్ల వద్ద యూరియా సరిపడినంత స్టాక్‌ అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో మొత్తం 4,766 మెట్రిక్‌ టన్నుల యూరియా స్టాక్‌ అందుబాటులో ఉందని, ఇందులో సహకార సంఘాల వద్ద 4,44 మెట్రిక్‌ టన్నులు, ప్రైవేట్‌ డీలర్ల వద్ద 502 మెట్రిక్‌ టన్నులు, మార్క్‌ఫెడ్‌ బఫర్‌ 3,819 మెట్రిక్‌ టన్నులు ఉందన్నారు. యూరియా సరఫరా విడతల వారీగా ఉంటుందని, రైతులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా అధికారులు అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షణకు అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement