ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటు వారి సమస్యలను పరిష్కరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఎస్టీయు నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ పెండింగ్ డీఏలు, పీఆర్సీ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ తయారు చేసి ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపు అస్తవ్యస్తంగా ఉందని, ఉపాధ్యాయులకు 200 కిలోమీటర్ల దూరంలో సెంటర్లు వేశారని వాటిని సరిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేశ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, జీవన్, జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ


