ఎయిడ్స్ రహిత జిల్లాగా మారుద్దాం
మెదక్‌జోన్: జిల్లాను ఎయిడ్స్ రహితా జిల్లాగా మారుద్దామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీరామ్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎయిడ్స్ నియంత్రణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. ఎయిడ్స్ పూర్తిగా నిర్మూలించడం మన చేతుల్లోనే ఉందని సురక్షితమైన లైంగిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉంటామన్నారు. ఉచితంగా పరీక్షలు, మందులు అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది అంటువ్యాధి కాదనీ, బాధితుల పట్ల వివక్ష చూపరాదన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ ఎస్ డాక్టర్ శివదయాల్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ హరిప్రసాద్, ఏపీఎంవో శంకర్, ఏఎన్‌ఏంలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
చిన్నశంకరంపేట(మెదక్): గ్రామపంచాయతీ ఎన్నికల వేళ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ ఆదేశించారు. మంగళవారం చిన్నశంకరంపేట, నార్సింగి మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడుతూ... ఎన్నికల వేళ అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, ఎలక్షన్స్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫార్మాసిస్ట్ గదులను పరిశీలించిన ఆయన ఏఎన్‌ఎంలు అడిగిన మందులను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వైశాలి, నార్సింగి డాక్టర్ రవికుమార్, వైద్య సిబ్బంది ఉన్నారు.


