సమన్వయంతో పనిచేయండి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
కొల్చారం(నర్సాపూర్): సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు కోసం సమన్వయంతో పనిచేసి మెజార్టీ సర్పంచ్ స్థానాలు గెలుపొందాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. సోమ వారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమన్నారు. అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్క ఓటు అమూల్యమని, ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ15 రోజులు పార్టీ నాయకులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన విధానాన్ని, ప్రతి ఓటర్ వద్దకు తీసుకెళ్లి ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఎవరు అభ్యర్థిగా నిలబడిన సమన్వయంతో గెలిపించుకోవాలని, అప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, సీనియర్ నాయకుడు ఉమన్నగారి దేవేందర్‌రెడ్డి, మండల యువత అధ్యక్షుడు సంతోశ్‌రావు, మంజుల, మేఘమాల, నాయకులు ఇంద్రసేనారెడ్డి, బాగారెడ్డి, యాదయ్య, గోదావరి, రవితేజరెడ్డి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


