ఎన్నికల ప్రచార ఖర్చులు ఇలా..
జహీరాబాద్: గ్రామ పంచాయతీలకు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమావళికి లోబడి అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సర్పంచ్, వార్డు పదవులకు పోటీ చేసే అభ్యర్థులు రోజువారీ వివరాలను అధికారులకు ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా పదవులను బట్టి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం కోసం సైకిల్ రిక్షా వినియోగిస్తే రోజుకు రూ. 400, ఆటోరిక్షా అయితే రూ.1,500, టాటాఏస్ అయితే రూ. 1,600గా నిర్ణయించారు. 100 యాంప్స్ మైక్‌సెట్‌కు రూ. 2,500, వెయ్యి వాల్ పోస్టర్లకు రూ. 5 వేలు ప్రకటించారు. తలపై ధరించే టోపీకి రూ. 40, టీ షర్టుకు రూ.100 వంతున ఖర్చు చూపాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఒక రోజు కారు అద్దెను రూ. 2,500, ఇన్నోవాకు రూ. 3,500 చూపాలి. ఒక్కో కుర్చీకి రోజుకు రూ. 20 గా, వీఐపీ కుర్చీ అయితే రూ.100గా అద్దెను నిర్ణయించారు. కూల్‌డ్రింక్ రూ. 20 వంతున, వాటర్ ప్యాకెట్‌కు రూపాయి, చాయ్ రూ. 10, కాఫీకి రూ. 15 వంతున ధరలను లెక్కలో చూపాల్సి ఉంటుంది. కిలో బరువు ఉన్న బాణాసంచాకు రూ. 800 వంతున, ఒక డప్పుకు రూ. 700 వంతున లెక్కకట్టాల్సి ఉంటుంది. సాదా భోజనానికి రూ. 80, మటన్ బిర్యానీకి రూ. 150, చికెన్ బిర్యానీకి రూ. 100 చొప్పున బిల్లు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.


