టైరు పేలి.. పల్టీ కొట్టిన వాహనం
● పది మందికి గాయాలు ● డ్రైవర్ పరిస్థితి విషమం
జహీరాబాద్ టౌన్: జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న ప్యాసింజర్ వాహనం టైరు పేలడంతో పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలతో సహ పదిమందికి గాయాలు కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... కర్నాటక రాష్ట్రంలోని బీదర్, ఔరాద్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులను తీసుకుని తుపాన్ వాహనం సోమవారం హైదరాబాద్‌కు వెళ్తుంది. మండలంలోని హుగ్గెల్లి గ్రామ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద వాహనం ముందు టైర్ పేలింది. దీంతో వాహనం పల్టీలు కొడుతూ బోల్తాపడింది. ఆ వాహనంలో ఉన్న నలుగురు పిల్లలతో సహ పది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరు జహీరాబాద్, మరికొంత మందిని బీదర్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ గిరికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం అతడ్ని హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


