నేడు డయల్ యువర్ డీఎం
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని 85003 76267 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
డిసెంబర్ 21న
జాతీయ లోక్ అదాలత్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర
సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో న్యాయవాదులు, ఇన్సూరెనన్స్ అధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. మొండి బకాయిలు, యాక్సిడెంట్ కేసులు, చిట్‌ఫండ్ కేసులు వంటివి రాజీపడే అన్ని కేసులను పరిష్కారమయ్యే విధంగా సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. డిసెంబర్ 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య, లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమ నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు మీడియా సహకరించాలని కోరారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీపీఆర్‌ఓ విజయలక్ష్మి, అడిషనల్ డీపీఆర్‌ఓ ఏడుకొండలు తదతరులు పాల్గొన్నారు.
చిత్రలేఖనం పోటీల్లో
‘గురుకుల’ విద్యార్థుల ప్రతిభ
జహీరాబాద్: గత సెప్టెంబర్‌లో ముంబయికి చెందిన మాస్టర్ ఆర్ట్ వారు నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారు. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 16 మంది ఉత్తమ ప్రతిభను కనబర్చి పతకాలు సాధించారు. వీరిలో ఐదుగురు గోల్డ్ మెడల్స్, ఆరుగురు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు ప్రిన్సిపాల్ ఎల్.రాములు, వైస్ ప్రిన్సిపాల్ కె.కుమార్, ఆర్ట్ ఉపాధ్యాయుడు శ్రీపాద్‌లు పేర్కొన్నారు. ఆర్.శివరాం స్కెచింగ్ అండ్ డ్రాయింగ్‌లో 4వ బహుమతి సాధించారన్నారు. బి.రవీందర్‌కు మాస్ట్రో అవార్డు, ట్రోఫీ లభించిందని తెలిపారు.
నేడు విద్యుత్ సరఫరా
అంతరాయం
పటాన్‌చెరు టౌన్: చెట్ల కొమ్మలు తొలగింపు నేపథ్యంలో శనివారం విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని ఏఈ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఐనోల్, పటేల్‌గూడ సబ్ స్టేషన్‌ల పరిధిలో ఉదయం 11 నుండి 11:30 వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.
నేడు డయల్ యువర్ డీఎం


