కొత్త పంచాయతీల్లో ఎన్నికళ
తొలిసారిగా ఎన్నికలు
● తండాల్లో పండుగ వాతావరణం ● బరిలో నిలిచేందుకు యువత ఆసక్తి
హుస్నాబాద్: కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు కారణం. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లుగా పోటీ చేసే అవకాశం రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట మండలంలో ఆరు గిరిజన తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. దాస్ తండా, కెప్టెన్ చౌట్‌తండా, చౌటకుంట తండా, హరిరామ్ అంబానాయక్ తండా, శ్రీరామ్ తండా, సేవాలాల్ మహరాజ్ తండాలు నూతనంగా గ్రామ పంచాయతీలుగా మారాయి. ఇందులో సర్పంచ్ స్థానాలు ఎస్టీ రిజర్వుడ్ అయ్యాయి. ఇక్కడ మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి సారి సర్పంచ్‌గా, వార్డు మెంబర్‌గా ఎన్నిక అయ్యేందుకు చాలా మంది యువకులు ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సర్పంచ్‌గా మొదటి సారి ఎన్నికై తే తమ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు.
ఎన్నికల క్షేత్రంలోకి యువకులు..
మొదటి సారిగా ఆ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండటంతో యువకులు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునే పడిలోపడ్డారు. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పరాయి పంచాయతీ పాలనలో తండాలు అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ముందుగా ఆ గ్రామానికి వెచ్చించిన తర్వాతే తండాలకు కేటాయించే వారని, దీంతో అభివృద్ధిలో వెనుకబడి పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాలు గ్రామ పంచాయతీలుగా మారడంతో తమ గ్రామాలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సేవాలాల్ మహరాజ్ తండా
కొత్త పంచాయతీల్లో ఎన్నికళ


