ఏకగ్రీవం.. చట్టవిరుద్ధం
● నామినేషన్లను అడ్డుకుంటే చర్యలు ● సీపీ విజయ్‌కుమార్
హుస్నాబాద్: గ్రామ పంచాయతీల్లో వేలం పాట ద్వారా సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చట్ట విరుద్ధమని సీపీ విజయ్‌కుమార్ అన్నారు. వచ్చే నెల 3న సీఎం రేవంత్‌రెడ్డి హుస్నాబాద్‌లో పర్యటించనున్న సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నిక నిబంధనల పరంగా జరగాలన్నారు. సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం కోసం డబ్బులు, వస్తువులు, భూములు ఇవ్వాలని డిమాండ్ చేసి, మిగిలిన ఆశావహులను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం చట్ట వ్యతిరేకమన్నారు. దీంతో ఎన్నిక రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. వేలం పాట వేయడం, బెదిరించడం, స్వచ్ఛందగా నామినేషన్లు వేసే వారిని ఎవరూ అడ్డుకోవద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు, రౌడీషీటర్లు, కేసులు ఉన్నవారిని, గొడవలు చేసే వారిని బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో డబ్బులు, మద్యం, గిఫ్ట్ వస్తువులు పంచరాదన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై ప్రత్యేక నిఘా పెడుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.


