ఎత్తెంత.. బరువెంత..?
చిన్నారుల ఆరోగ్యంపై సర్కార్ దృష్టి
● చూపు, వినికిడి లోపాలపై కూడా.. ● చిన్నారులకూ 100మి.లీ పాలు ● కేంద్రాల ఆవరణల్లో ఆకుకూరల సాగు
చిన్నారులను పరిశీలిస్తున్నాం
పిల్ల వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు ఉన్నారా లేదా అన్న విషయాలను పరిశీలిస్తున్నాం. చిన్నారుల్లో వినికిడి లోపం, ఆరోగ్య సమస్యలు కన్పిస్తే గుర్తించి వారి కుటుంబీకులకు తెలియపర్చి తగు చికిత్సలు అందిస్తాం. స్థలాలు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ వాటికలో భాగంగా ఆకుకూరలు, కూరగాయలు పండించేందుకు అలాట్ చేశాం.
– లలితకుమారి, ప్రాజెక్టు డైరెక్టర్,
సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, సంగారెడ్డి
నారాయణఖేడ్: చిన్నారుల్లో వస్తున్న ఆరోగ్య లోపా లు నివారిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీలకు వచ్చేది పేద, మధ్యతరగతి చిన్నారులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల వీరు వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు పెరగడంలేదని, వారి ఎదుగుదల కూడా సరిగ్గాలేని విషయాన్ని మహిళా సీ్త్రశిశుసంక్షేమ శాఖ అధికారులు గుర్తించారు. చిన్నారుల ఆరోగ్యం పరిశీలనతోపాటు వారికి సంపూర్ణ పౌష్టికాహారం అందజేసేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు, గర్భిణీలకు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలను అందజేస్తున్నారు. ఈ తరహాలోనే చిన్నారులకు సైతం 100 మి.లీ చొప్పున పాలను అందజేయనున్నారు.
బాల్యం బలహీనం
జిల్లాలోని మెజార్టీ అంగన్‌వాడీ కేంద్రాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని స్లమ్ ఏరియాల్లో ఉండే చిన్నారుల్లో లోపాలను అధికారులు గుర్తించారు. జిల్లాలో ఆరేళ్లలోపు చిన్నారులు 1,02,755 మంది అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్నారు. వీరిలో తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలు (ఎస్‌ఏఎం) 627మందిగా, తక్కువ పోషకాహార లోపం ఉన్న పిల్లలు (ఎంఏఎం) 2,623 మందిని గుర్తించారు. ఇక గర్భవతులు 7,973 మంది, బాలింతలు 6,779మంది కేంద్రాలకు వస్తున్నారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతీనెల చిన్నారుల బరువు, ఎత్తు సక్రమంగా తీస్తున్నదీ లేదా అన్న అంశాలపై మహిళా సీ్త్ర శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారిణి లలితకుమారి క్రాస్ చెకింగ్ కోసం రెండు నెలల క్రితం జిల్లాలోని సూపర్‌వైజర్లతో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయించారు.
ఆరోగ్యంపై దృష్టి
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఆరేళ్లలోపు చిన్నారులందరికీ రక్తపరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. వీరితోపాటే కేంద్రలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు కూడా రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించనున్నారు. చిన్నారులు బలహీనతతోపాటు కంటిచూపు, వినికిడి లోపాలు, వయస్సు ప్రకారం రావాల్సిన మాటలు వస్తున్నదీ లేనిదీ గుర్తించేందుకు చర్యలు చేపట్టనున్నారు. కంటిచూపు, వినికిడి లోపాలు, మాటలు సక్రమంగా పలకక పోవడం లాంటివి గుర్తిస్తే తల్లిదండ్రులకు తెలియపర్చి వారికి జిల్లా కేంద్రా ఆస్పత్రికి తీసుకెళ్ళి చికిత్సలు అందజేయనున్నారు. వారికి శస్త్రచికిత్సలు అవసరమైతే అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి నివేదించి తగు చర్యలు తీసుకోనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పోషణ్ వాటిక కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రాల ఆవరణల్లో పాలకూర, టమాట, వంకాయ, బెండకాయ, మెంతికూర వంటి పౌష్టిక ఆకు కూరలు, కూరగాయలు పండించనున్నారు. ఇందుకు సంబంధించి నిర్దేశించిన కేంద్రాలకు రూ.9,500 చొప్పున అందజేస్తున్నారు. జాతీయ పోషణ మిషన్‌కు అనుబంధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు
ఎత్తెంత.. బరువెంత..?


