బహుమతి పొందుదాం
ఉత్తరం రాద్దాం
తపాలా శాఖ ఆధ్వర్యంలో ‘ఢాయి ఆఖర్’ పోటీలు
● చేతిరాతకు 50 వేల ప్రైజ్ మనీ
మెదక్ కలెక్టరేట్: పెరుగుతున్న సాంకేతిక విప్లవం పోస్టల్ వ్యవస్థను ఒక కుదుపు కుదిపేసింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు రావడంతో గతంలో మాదిరిగా ప్రజలు ఉత్తరాలు , పోస్టల్ సేవలను వినియోగించడం లేదు. ప్రజలతోపాటు పలు కార్యాలయాలు, సంస్థలు ఉత్తర ప్రత్యుత్తరాలు, మెయిల్స్ ద్వారానే నిర్వహిస్తున్నాయి. డిజిటలైజేషన్‌తో ఉపాధ్యాయులు సైతం ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా తరగతులు బోధిస్తున్నారు. ఫలితంగా చాలా వరకు చేతి రాత తగ్గిపోతోంది. ఇది గుర్తించిన తపాలా శాఖ తమ వైపు తిప్పుకునేలా డిజిటల్ సేవలను అందిస్తుంది. ఇందులో భాగంగా చేతిరాతను ప్రోత్సహించేందుకు ఢాయి ఆఖర్ పేరుతో పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తుంది.
రాయాల్సిన అంశాలు
ఈ సంవత్సరం ‘‘నా రోల్ మోడల్‌కి లేఖ’’ అనే అంశంపై ఉత్తరం రాయాలి. అభ్యర్థులు తమ చేతితోనే రాయాలని, టైప్ రైటింగ్ చెల్లదని తపాలా శాఖ సూచించింది. ఎన్వలప్ కవర్‌లో రాసేవారు ఏ4 సైజు తెల్ల కాగితంలో వెయ్యి పదాలు, ఇన్‌లాండ్ లెటర్‌లో 500 పదాలకు మించకూడదు. అభ్యర్థులు కేవలం హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే రాయాలి. 18 ఏళ్లలోపు , ఆపై వయస్సు గల వారికి రెండు కేటగిరిల్లో పోటీ ఉంటుంది. ఉత్తరానికి వయస్సు ధృవీకరణ పత్రం కూడా జత చేయాలి. వీటిని ఢాయి ఆఖర్, ఎన్‌ఓపీఓఎస్ మెదక్ డివిజన్ పేరిట డిసెంబర్ 8వ తేదీలోపు పంపించాలి.
రూ.50వేల బహుమతి
సర్కిల్ స్థాయిలో ప్రతి కేటగిరిలో మూడు ఎంట్రీలను ఎంపిక చేసి బహుమతులిస్తారు. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతికి రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ రూ.10వేల నగదును ప్రకటించారు. సర్కిల్ స్థాయిలో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5 వేలు ఇవ్వనున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది.
జాతీయ స్థాయిలో పోటీలు
పోస్టల్ శాఖ ప్రజలు, విద్యార్థులను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన ప్రైజ్‌మనీతో ప్రత్యేకంగా ఢాయి ఆఖర్ పేరిట ప్రతి యేడాది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు అభ్యర్థుల నుంచి లేఖలు స్వీకరిస్తుంది.
యువతరం కోసమే..
నేటి యువతరాన్ని పోస్టల్ వైపు ఆకర్షించేందుకు ఢాయి ఆఖర్ ఒక జాతీయ స్థాయి వేదిక. అలాగే సృజనాత్మకత, వాస్తవీకత, స్వీయ వ్యక్తీకరణను ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో వ్యక్తులు తమ రచనా నైపుణ్యాలు, ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తుంది. చేతిరాత అనేది విద్యార్థులకు చదవడం, రాయడం, భాషా సామర్థ్యాలు, విమర్శనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేస్తాయి. అలాగే మెదడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీహరి, పోస్టల్ సూపరింటెండెంట్, మెదక్
బహుమతి పొందుదాం


