పొలం బాట పట్టి
జహీరాబాద్: ఉద్యానవన పంటలతోపాటు వాణిజ్య, చిరుధాన్యాల పంటల సాగుకు ప్రసిద్ధిగా ఉన్న జహీరాబాద్ ప్రాంతంలో పంటల అధ్యయనానికి పలు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు తరలివస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన కళాశాలకు చెందిన విద్యార్థులు ఐదు బ్యాచ్‌లకు సంబంధించి 250 మంది సందర్శించారు. మల్లారెడ్డి కళాశాలకు చెందిన మూడు బ్యాచ్‌లకు చెందిన 150 మంది విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. వనపర్తి జిల్లాలోని ఉద్యాన కళాశాల విద్యార్థులు సైతం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. ప్రతీ బ్యాచ్ మూడు నెలల పాటు క్షేత్రపర్యటన చేస్తారు. ప్రతీ ఏటా ప్రత్యేకంగా ఎంపిక చేసి విద్యార్థులు అవగాహన పొందేందుకు జహీరాబాద్ ప్రాంతంలోని రంజోల్, పస్తాపూర్, చిన్న హైదరాబాద్, హోతి(కె), బాబానగర్ గ్రామాల్లో పర్యటిస్తారు. గ్రామీణ ఉద్యాన పని అనుభవ శిక్షణ కార్యక్రమం(రావెప్)లో భాగంగా క్షేత్ర పర్యటన చేస్తారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వారు సాగు చేస్తున్న పంటలను అధ్యయనం చేస్తారు. పంటల సాగులో విత్తనం ఎంపిక నుంచి పంట చేతికి అంది వచ్చే వరకు ఎలాంటి యాజమాన్య పద్ధతులను అవంబిస్తారనేది తెలుసుకుంటారు.
ఎగ్జిబిట్లను ప్రదర్శించి మరీ...
అవగాహన పొందడంతోపాటు విద్యార్థులు కళాశాలల్లో నేర్చుకున్న వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు తయారీ గురించి ఎగ్జిబిట్లను ప్రదర్శించి రైతులకు చెబుతున్నారు. రావెప్ కార్యక్రమానికి వచ్చే విద్యార్థులను జట్లుగా ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని రైతుల ఇంటి వద్ద నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంబంధిత రైతుతో కలిసి నిత్యం క్షేత్రస్థాయి పర్యటన చేసి వారి అనుభవాల గురించి తెలుసుకుంటున్నారు. పంటల సాగు విధానం, వాటిలో చేపట్టాల్సిన అంతర కృషి, పంట దిగుబడులను సాధించడం, ఎరువుల యాజమాన్య పద్ధతులు, సేంద్రీయ ఎరువుల వినియోగం, పచ్చిరొట్టె ఎరువుల విధానం, మార్కెటింగ్, రవాణ, వ్యవసాయానికి అనుబంధంగా ఉండే అంశాలపై అనుభవం పొందుతున్నారు. రావెప్ కార్యక్రమానికి తరలివచ్చే విద్యార్థులకు ఏఈఓ ప్రదీప్‌కుమార్ గైడ్‌గా వ్యవహరిస్తూ ఆయా పంటల గురించి అవగాహన కల్పిస్తున్నారు.
క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న
ఉద్యాన, వ్యవసాయ విద్యార్థులు
‘రావెప్’కార్యక్రమానికి
స్వాగతిస్తున్న రైతులు
పొలం బాటలో నేర్చుకున్న
అనుభవాల ప్రదర్శన
పొలం బాట పట్టి


