రోడ్డుపై సంత.. తప్పని చింత
చేగుంట(తూప్రాన్): వారాంతపు సంతతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వడియారంలో ప్రతి గురువారం వారాంతపు సంత జరుగుతుంది. అయితే ప్రధాన రహదారి పక్కనే సాగుతుండటంతో స్థానికులు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. వాహనాలపై సంతకు వచ్చేవారు రోడ్డుపక్కనే పార్కింగ్ చేయడం, జనాలు రోడ్డు దాటి సంతలోకి వస్తున్నారు. ఈ క్రమంలో సంత సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి వరకు జరుగుతుండటంతో ప్రమాదాలకు ఆస్కారం ఉందని పేర్కొంటున్నారు. సంతకు జనాల రాక పెరిగిపోవడంతో రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలు అదుపుతప్పితే సంతలోకి దూసుకెళ్లే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. అధికారులు సంతపై దృష్టి సారించి మరోచోట నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


