శంభుని కుంటను పరిరక్షించండి
● సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ● సుందరీకరణ చేయాలని డిమాండ్
పటాన్ చెరు: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శంభుని కుంటను పరిరక్షించి ప్రజా అవసరాల కోసం సుందరీకరించాలని సీపీఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం సీనియర్ నాయకులు పాండు రంగారెడ్డి, నరసింహారెడ్డి, ిసీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు నాయిని లలిత, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత తదితరులు మాట్లాడారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని, కుంటలో ఉన్న చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. పిల్లలకు, వృద్ధులకు ఉపయోగపడేలా కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్, పార్కులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చుట్టుపక్కల కాలనీవాసులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున సంతకాలు చేశారని అన్నారు. ఈ సంతకాలను సోమవారం జిల్లా కలెక్టర్‌కు అందజేసి ప్రజల ఆకాంక్షను తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జార్జ్, శ్రీనివాస్, సత్తిబాబు, శ్రీనివాస్ రెడ్డి, మహిళా సంఘం నాయకులు సుజాత, మల్లేశ్వరి, యువజన సంఘం నాయకులు సురేశ్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.


