విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి
దుబ్బాకటౌన్ : విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెల్లాపూర్ వార్డుకు చెందిన తొగుట నరేందర్ రెడ్డి తన పాడి గేదెను పొలంలో కట్టేశాడు. మధ్యాహ్నం వచ్చి చూడగా విద్యుదాఘాతంతో మృతి చెంది కనిపించడంతో బోరున విలపించాడు. గేదె విలువ దాదాపు రూ. 80 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
తప్పిపోయిన
విద్యార్థి అప్పగింత
సంగారెడ్డి క్రైమ్: తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ కనిపెట్టి పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా... పట్టణంలోని రాజంపేట్‌కు చెందిన తలారి సుధాకర్ కుమారుడు నిక్సాన్(12) స్థానిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ బాలుర పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన సాయంత్రం 5గంటల సమయంలో తప్పిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి విద్యార్థి సదాశివపేట్ మండలం సూరారం గ్రామంలోని తన మేనమామ ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. శనివారం ఉదయం బంధువుల ఇంట్లో ఉన్న విద్యార్థిని స్టేషన్‌కు తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.


