రైతుసేవలో రారాజు
సెలవొస్తే... రైతు కుటుంబాల చెంతకు
వైఎస్‌ఆర్ స్ఫూర్తితో..
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2003లో చేపట్టిన పాదయాత్రలో మెదక్ జిల్లాలో ఆయనను కలిసి పులి రాజు వినతి పత్రం అందించారు. అంతేకాదు.. ఆయన పిలుపు మేరకు ఉచిత విద్యుత్ పథకానికి తొలిసారిగా తన వేతనంలో కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. అలాగే వైఎస్‌ఆర్ అందించిన స్ఫూర్తితో రైతులకు మరింత సహకారం అందించాడు. 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ఇతర కేంద్ర మంత్రులను సైతం కలిసి రైతుల ఆత్మహత్యలపై వినతి పత్రాలను అందించారు.
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల దుఃఖం, ఆవేదన, ఉద్వేగం ఉపాధ్యాయుడిని కదిలించింది. వారి కోసం ఏదో చేయాలనే తపన.. తన సెలవు రోజులను త్యజించి బాధిత కుటుంబీకుల చెంతకు చేరేలా చేసింది. ఈ క్రమంలో వారి స్థితిగతులపై అధ్యయనం, ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా అందేలా ప్రయత్నించడం, దాతల సహకారంతో అండగా నిలిచేలా బాటలు వేసింది. రెండున్నర దశాబ్దాల కాలంలో 5లక్షల కిలోమీటర్లు తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో 5వేల కుటుంబాలను కలిశాడు. గజ్వేల్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి రాజు ప్రస్థానంపై ఈ వారం కథనం.
– గజ్వేల్
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి
‘రైతు నేస్తం’ అవార్డు అందుకుంటున్న పులి రాజు
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామం ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన పులి రాజు 2002లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు. ప్రస్తుతం వర్గల్ మండలం తునికిఖాల్సా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. 1997లో కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ(ఎకనామిక్స్) చదువుతున్న సందర్భంలో తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న పత్తి రైతుల ఆత్మహత్యలపై చలించిపోయాడు. దీని తర్వాత 25 ఏళ్ల క్రితం నుంచే తెలంగాణ వ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలను ఓ రిజిష్టర్‌లో నమోదు చేయడం మొదలెట్టాడు. సెలవు దొరికినప్పుడల్లా, అవసరమైతే సెలవు పెట్టి... తెలంగాణ రాష్ట్రంలో 5లక్షల కిలోమీటర్లు, ఏపీలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. ఇలా 5వేల ఆత్మహత్య బాధిత కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకుని రికార్డు చేశారు. ఈ క్రమంలో ఎన్నో కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా వచ్చేలా ప్రయత్నించాడు. దాతల నుంచి సహకారం కూడా అందించాడు. ఇలా 3వేల కుటుంబాలకు మరింత సహకారం అందేలా చేశాడు.
పలు అవార్డులు
2015లో న్యూఢిల్లీలోని సివిల్ సొసైటీ మ్యాగజైన్ ఆధ్వర్యంలో ఆల్‌ఆఫ్ ఫేమ్ అవార్డు, 2017లో అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాజు అందుకున్నారు. 2019లో అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి ‘రైతు నేస్తం’, 2024లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ‘కిసాన్ సేవా రత్న’ అవార్డులను ఆయన అందుకున్నారు.
● 5వేల మంది ఆత్మహత్య బాధిత కుటుంబాలపై అధ్యయనం
● ఎక్స్‌గ్రేషియా అందేలా ప్రయత్నం
● 5లక్షల కిలోమీటర్ల ప్రయాణం
● ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి రాజు సంకల్పం
‘వేలూరు ఆత్మహత్యల
గోస’ పుస్తకావిష్కరణ
వర్గల్ మండలం వేలూరు గ్రామంలోని రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల దీన స్థితిని వివరిస్తూ తాజాగా ఈనెల 16న గజ్వేల్‌లో ‘వేలూరు ఆత్మహత్యల గోస’ పేరిట పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం
సమక్క ఆదివాసీ కుటుంబం వివరాల సేకరణ
రైతు ఆత్మహత్యలు ఆగాలి
దేశానికి అన్నం పెడుతున్న రైతు ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరం. రైతుల ఆత్మహత్యలు ఆగాలి. 5వేల బాధిత కుటుంబాలను కలిసి వారి బాధలు విన్న. సాధ్యమైనంతవరకు అండగా నిలబడ్డ. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తా.
– పులి రాజు, ఉపాధ్యాయుడు
హైకోర్టులో కేసు వేసి.. ఎక్స్‌గ్రేషియా
2012లో రాష్ట్రంలోని 452 రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు 421 జీఓ ప్రకారం వివిధ కారణాలతో పరిహారం అందలేదు. దీంతో వారి పక్షాన ప్రముఖ న్యాయవాది పాకాల శ్రీహరిరావుతో కలిసి హైకోర్టులో కేసు వేసి ఆ కుటుంబాలకు పరిహారం అందేలా ఆయన అలుపెరగని కృషి చేశారు.
రైతుసేవలో రారాజు
రైతుసేవలో రారాజు
రైతుసేవలో రారాజు
రైతుసేవలో రారాజు


