డబ్బులు సంపాదించాల నేఆశతో..
సిద్దిపేటకమాన్: కేబుల్ వైర్ చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావు కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన 14మంది కేబుల్ వైర్ల పిటింగ్‌లో కూలీ పనులు చేస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కేబుల్ వైర్ల పనిలో అనుభవం ఉండటంతో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆటోలో రెండు కుటుంబాలకు చెందిన 14 మంది సిద్దిపేట జిల్లాకు వచ్చి పగటి సమయంలో పలు ప్రాంతాల్లో పరిశీలించారు. ఈ క్రమంలో సిద్దిపేట పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ఈనెల 3న రాత్రి కేబుల్ వైర్‌ను చోరీ చేసి నిజామాబాద్‌కు వెళ్లిపోయారు. మరుసటి రోజు బోధన్‌లో కేబుల్ వైర్లు దొంగిలించారు. బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం పట్టణంలో వాహనాల తనిఖీ చేస్తుండగా బోధన్ నుంచి సిద్దిపేటకు వస్తున్న 14మందిలో ఇద్దరు మైనర్లు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు చేసిన చోరీలు ఒప్పుకున్నారు. నిందితుల్లో వేముల బుజ్జి, గంజే లక్ష్మయ్య, తురక ఏడుకొండలు, వేముల బుడ్డియ్య, కుంచాల పాండు, వెంకన్న, వేముల సుజాత, కుంచాల మల్లీశ్వరి, తురక వెంకటలక్ష్మి, వేముల పాటమ్మ, వేముల సత్తిరాజు, వేముల దుర్గప్రసాద్‌తో పాటు ఇద్దరు బాల నేరస్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గూడ్స్ ఆటో, 260 మీటర్ల బీఎస్‌ఎన్‌ఎల్ కేబుల్ వైర్, 10గడ్డపారలు, 12పారలు, 8 సెల్‌ఫోన్‌లు, రూ.2లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కేబుల్ వైర్లు చోరీ ఏపీకి చెందిన 14 మంది అరెస్ట్ వివరాలు వెల్లడించిన పోలీసులు


