
ఫైనాన్స్ వేధింపులకు యువకుడు బలి
సిద్దిపేటఅర్బన్: ఫైనాన్స్ వేధింపులకు యువకుడి బలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం... ఎల్లుపల్లి గ్రామానికి చెందిన ఐరేని మల్లేశం (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2023లో నూతనంగా నిర్మించుకున్న ఇంటి కోసం ఓ ప్రైవేట్ కంపెనీ ౖౖౖఫైనాన్స్‌లో రూ. 7 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దీనికి తోడు టీ షాపు నిర్వహించడానికి కొంత అప్పు చేశాడు. ఈ క్రమంలో టీ షాపు సరిగా నడవకపోవడంతో ఆర్థికంగా భారం ఎక్కువైంది. దీంతో ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడంతో ఫైనాన్స్ వారు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారు. ఫోన్ చేయడమే కాకుండా ఇంటికి రావడం, పనికి వెళ్లిన చోటుకి వెళ్లి వేధిస్తున్నారు. కొన్ని రోజులు సమయం ఇస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ వినకుండా ఈ నెల 16న సాయంత్రం ఫైనాన్స్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తేనే వెళ్తామని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన అతడు వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.