
ముగిసిన రాంచంద్రారెడ్డి అంత్యక్రియలు
కోహెడరూరల్(హుస్నాబాద్): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ కోసా అలియాస్ రాజు దాదా అంత్యక్రియలు కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో శనివారం ముగిశాయి. ఛత్తీస్‌గఢ్‌లో గత నెల 22న పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. కాగా ఆయన మృతదేహన్ని ఛత్తీస్‌గఢ్ నుంచి కుమారుడు రాజాచంద్ర స్వగ్రామానికి ఉదయం తీసుకొచ్చారు. గ్రామంలో ఆయన ఇంటి వద్ద మృతదేహన్ని చూసి భార్య శాంతితో పాటు కూతురు కన్నీరు మున్నీరుగా విలపించారు. కడసారి చూసేందుకు పలు విప్లవ, ప్రజా పౌరహక్కుల సంఘాల, రాజకీయ పార్టీల నేతలతో పాటు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మవోయిస్ట్‌లను హతమారుస్తున్నారని పలువురు మండిపడ్డారు.
17 రోజుల తర్వాత
మృతదేహం లభ్యం
జోగిపేట(అందోల్): జోగిపేటకు చెందిన లోక చంద్ర (37) మృతదేహం చౌటకూరు మండలం వెండికోలు శివారులోని మంజీరా నది ఒడ్డున 17 రోజుల తర్వాత లభ్యమైంది. గత నెల 30న శివ్వంపేట బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. అప్పట్లో గాలింపు చర్యలు చేపట్టినా సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద ప్రవాహం తీవ్రంగా ఉండటం వల్ల మృతదేహం దొరకలేదు. మూడు రోజుల క్రితం నీటి ప్రవాహం తగ్గడం వల్ల మృతదేహం బయటపడింది. శనివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో తహసీల్దారు కార్యాలయం ఎదుట మృతుడి కుటుంబీకులు, బంధువులు నిరసన తెలిపారు. మృతుడి తల్లి ప్రమీల తన కొడుకు చావుకు రాజకీయ నాయకులు కారణమని ఆరోపించింది. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో నిరసన విరమించారు.