
ఈతకు వెళ్లి వ్యక్తి గల్లంతు
జిన్నారం (పటాన్‌చెరు): చెరువులో ఈతకు వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై హనుమంత్ వివరాల ప్రకారం... గడ్డపోతారం పట్టణ పరిధి లోని చౌదరిగూడెం గ్రామానికి చెందిన గురుగోజు పాండురంగ చారి (45)కి ప్రతిరోజు లింగం చెరువులో ఈతకు వెళ్లే అలవాటు ఉంది. రోజు లాగే శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈతకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతుండగా నీటిలో మునిగాడు. కనిపించకపోవడంతో స్థానికు లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు గాలించిన ఆచూకీ లభించలేదు.
చెరువులో మృతదేహం లభ్యం
సంగారెడ్డి టౌన్: అదృశ్యమైన వ్యక్తి శవమయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన శివ సాకేత్ (19) ఈనెల 13న ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అయితే అతడు డ్రైవర్‌గా ఊబర్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా ఫసల్వాది శివారులోని మంజీరా వద్ద కారు పార్కు చేసి ఉండటంతో పోలీసులు పరిశీలించారు. చెరువులో మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి..
చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన చేగుంటలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... నార్సింగి గ్రామానికి చెందిన మల్లేశ్(45) చేగుంటలోని గీతా పాఠశాల సమీపంలోని కల్వర్టు వద్ద చేపలు పడుతున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని బయటకు తీశారు.