
దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
నర్సాపూర్: దాడి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ కేసు వివరా లు వెల్లడించారు. ఉపాధ్యాయుడు కిష్టయ్య ఈనెల 16న సొంత పనిపై కొల్చారం మండల కేంద్రానికి వెళ్లి అనంతరం అన్నారంలోని తన ఇంటికి వెళ్లేందుకు బస్టాండు వద్ద ఆటో ఎక్కాడు. నర్సాపూర్‌కు రాగానే అన్నారం వైపు వెళ్లకుండా తూప్రాన్ మార్గంలోని ఓ కుంట వద్దకు తీసుకెళ్లి ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అతడ్ని కత్తితో చంపుతామని బెదిరించి ఫోన్‌తో పాటు రూ.12వందలు దోచుకున్నారు. కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చౌటకూరు మండలం శివ్వంపేటకు చెందిన సాయికుమార్, కుమార్, రంగంపేటకు చెందిన అనిల్‌ను అరెస్ట్ చేశారు. వీరు పాత నేరస్తులని,పలు కేసులు ఉన్నాయని తెలిపారు. కాగా నిందితులు ఉపయోగించిన ఆటోతోపాటు ఉపాధ్యాయుడి ఫోన్, 12 వందల నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
మరో కేసులో ఇద్దరు..
చేర్యాల(సిద్దిపేట): దొంగతనం కేసులో ఇద్ద రు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఎల్ శ్రీను కథనం మేరకు... చేర్యాలలోని ఎల్లమ్మ గుడి వద్ద ఎస్‌ఐ నవీన్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా ముస్త్యాలకు చెందిన కెంచు శివశంకర్, సాల్లూరి సిద్ధిరాములు బైక్‌పై వచ్చి పోలీసులను చూసి పారిపోయారు. దీంతో వారిని పట్టుకుని విచారించగా ఈనెల 4న ముస్త్యాలలో తాళం వేసి ఉన్న తరిగొప్పుల నర్సింహులు ఇంట్లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. చోరీ చేసిన రెండున్నర తులాల బంగారు నెక్లెస్, 25 తులాల వెండి పట్టీలతో పాటు బైక్, రెండు సెల్‌ఫ్లోను స్వాధీనం చేసుకున్నా రు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.