
చేతికొచ్చే దశలో..!
పెట్టుబడి మట్టిలో పోసినట్లే..
దుబ్బాక మున్సిపల్ పరధిలోని చెల్లాపూర్‌కు చెందిన రైతు కొండె ఎల్లారెడ్డి 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. వర్షాలకు వరిపంటకు తెగుళ్లు వ్యాప్తి చెందాయి. ఈని గొలుసులు బయటకు వచ్చాక గింజ గట్టి పడకుండా తాలుపోయి తెల్లగా నిలబడిపోతుంది. రకరకాల మందులు పిచికారీతో పాటు పవర్ ఫుల్‌ఎండ్రీన్ గోళీలు చల్లినా ఫలితం లేదు. ఫర్టిలైజర్ దుకాణాల్లో మందులను పిచికారీ చేసిన లాభం లేదు. ఇప్పటి వరకు రూ.2 లక్షలు పెట్టిన పెట్టుబడి మట్టిలో పోసినట్లే అయింది.
దుబ్బాక: కోటి ఆశలతో రైతులు సాగు చేసిన పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు వరి గొలుసులు తెల్లగా మారిపోతున్నాయి. ఈ ప్రభావంతో వరి చేలల్లో ఈని గింజలు గట్టిపడకుండా పంటలు పొల్లుపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం అంతంత మాత్రమే ఉందని వాపోతున్నారు. దీంతో పాటు వరికి అగ్గి తెగుళ్లు, ఎండాకు తెగుళ్లు, సుడి దోమ, మొగి పురుగు రోగాలు వ్యాపించడంతో రైతులు అయోమయం చెందుతున్నారు.
తాలు పోతున్న వరి గొలుసులు
రైతన్నల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. పంటలు చేతికొస్తున్న దశలో తెగుళ్లతో నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం వరి చేలు పొట్టదశకు వచ్చి ఈనుతున్న తరుణంలో బయటకు వచ్చిన గొలుసులకు గింజలు గట్టిపడకుండా తెల్లగా తాలు పోతున్నాయి. వివిధ రకాల క్రిమిసంహారక మందులు చల్లినా ఫలితం కనబడకపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
3.63 లక్షల ఎకరాల్లో వరిసాగు..
జిల్లా వ్యాప్తంగా వానకాలంలో సుమారు 3.63 లక్షల ఎకరాల్లో వరిపంటలు సాగయ్యాయి. జిల్లాలోని చాల ప్రాంతాల్లో ముందుగా వేసిన వరి పంటలు ఈని గింజలు ఎర్రబడుతున్నాయి. ఈ క్రమంలో ఈనిన వరి చేలల్లో గొలుసులకు గింజలు పాలుపోసుకోకుండా అలాగే తెల్లబడి నిలబడిపోతున్నాయి. దుబ్బాక మండలంలోనే కాదు.. జిల్లాలోని చాల గ్రామాల్లో వరి పంటల పరిస్థితి దారుణంగా మారిది.
విపరీతంగా ఇష్టమొచ్చిన మందులు...
వరి చేల పై రైతులు వీపరీతంగా ఇష్టమొచ్చిన మందులు పిచికారి చేస్తున్నా ఫలితం లేని పరిస్థితి కనబడుతుంది.నాట్లు వేసినప్పుడు వాతవరణ పరిస్థితులతో ఎదగకుండా ఎర్రగా ఉండడంతో అప్పటి నుంచి ఇప్పుడు ఈని గొలుసు తాలుబోతుండడంతో రకరకాల మందులను వేల రూపాయలు పెట్టి తెచ్చి స్ప్రే చేస్తున్నా ఫలితం లేని పరిస్థితి ఏర్పడింది.
తెగుళ్లకు నివారణ..
వరిచేలు ఈని గింజలు గట్టి పడకుండా తాలుపోవడంతో పాటు మొగిపురుగు, ఎండాకు తెగులు, సుడిదోమ, అగ్గి తెగుళ్లలో మెడవిరుపు రోగం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అగ్గి తెగులు సోకిన భూముల్లో ఈ మెడవిరుపు తెగులు లక్షణాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం వరిపంటలపై మెడవిరుపు లక్షణాలు కనిపిస్తే ట్రై సైక్లోజన్ లేదా గెలిలియో సెన్స్ మందులు పిచికారీ చేయాలంటూ వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు
తెల్లగా మారుతున్న వరి గొలుసులు
ఈని గింజలపై పొల్లు ప్రభావం
మందులు కొట్టినా.. ఫలితం శూన్యమే
అయోమయంలో రైతులు
4 ఎకరాల్లో వరిపంట వేశా
నాలుగు ఎకరాల్లో వరిపంట వేశా. పంట మొత్తం ఈని గొలుసు ఎర్రబడుతుంది. ఈనిన గొలుసు పాలుపోసుకోకుండా గింజ గట్టిపడకుండా తెల్లగా గొలుసులా నిలబడిపోతుంది. చేను గిట్లయితుందని మందు తెచ్చి కొట్టిన. అయినా ఏం లాభం లేదు. చేతికొస్తుందనుకున్న చేను గిట్లకావట్లే. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– పాతూరి లక్ష్మణ్, రైతు దుబ్బాక
వరి పంటలను పరిశీలిస్తున్నాం
వరిపంటలకు రకరకాల తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఈని గొలుసులకు తాలుపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వరి పంటలను వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలిస్తున్నాం. ఇందులో వరిపంట కోత దశకు వచ్చే సమయంలో అగ్గితెగులు, ఎండాకు తెగులు, సుడిదోమ, మొగిపురుగు తదితర రకాల రోగాలు కనిపిస్తున్నాయి. ఫర్టిలైజర్ అధికంగా వాడడంతో పాటు అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులతో తెగుళ్లు ఎక్కువయ్యాయి. – డాక్టర్ పల్లవి, వ్యవసాయశాస్త్రవేత్త