
విద్యార్థి మృతిపై కొనసాగుతున్న విచారణ
హుస్నాబాద్‌రూరల్: మండలంలోని పోతారం(ఎస్)లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థి వివేక్ మృతిపై విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం గురుకుల పాఠశాలల డిప్యూటీ కార్యదర్శి సహజ విచారణ అధికారిగా హాజరయ్యారు. ఈ మేరకు పాఠశాలలోని ఉపాధ్యాయులతో పాటు ప్రిన్సిపాల్‌ను విచారించారు. విద్యార్థి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. అలాగే తోటి విద్యార్థుల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థి మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించారు. అంతేకాకుండా రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయులు, వార్డెన్‌ల వివరాలు తీసుకున్నారు. సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ లక్ష్మారెడ్డిలతో కలిసి సంఘటనపై చర్చించి సంఘటన సంబంధించి అంశాలను రాబట్టారు. ఈ మేరకు విచారణ నివేదికను గురుకులాల కార్యదర్శికి పంపించనున్నట్లు చెప్పారు. కాగా, విద్యార్థి మృతిపై కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మాల మహానాడు నాయకుడు ఆరె కిశోర్ వినతి పత్రం అందించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు.
గురుకులాల ప్రిన్సిపాల్స్ సమావేశం..
తెలంగాణ గురుకులాల సొసైటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రిన్సిపాల్స్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి ఆమె ముఽఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందులో గురుకులాల నిర్వహణ, నిధుల సమకూర్పుపై చర్చించినట్లు ప్రిన్సిపాల్స్ తెలిపారు. గురుకులాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలన్నారు. అలాగే పాఠశాలలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని ప్రిన్సిపాల్స్ డిప్యూటీ కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు.
విచారణ అధికారిగా డిప్యూటీ కార్యదర్శి సహజ