
‘క్యూనెట్’కు యువకుడి బలి
● సూసైడ్ నోట్ రాసి.. ఉరేసుకుని ఆత్మహత్య
● వేలూరులో ఘటన
వర్గల్(గజ్వేల్): ‘క్యూనెట్ వారు నన్ను మోసం చేశారు. వాళ్లు చెప్పింది ఒకటి.. అందులో చేసేది ఒకటి. నా వాళ్లు నాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు.. కానీ నేను ఆ నమ్మకాన్ని కోల్పోయాను. వాళ్లను మోసం చేస్తూ రోజురోజు బబతకటం నా వల్ల కాదు. ఎవరు కూడా తన జీవితాన్ని తనంతట తాను పాడు చేసుకోరు. పరిస్థితులు ప్రభావం చేస్తాయి.’..అంటూ సూసైడ్ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేస్తూ, మల్టీలెవెల్ చైన్ ఫైనాన్స్ సంస్థ ద్వారా మోసపోయానని పేర్కొంటూ ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.
ఈ ఘటన వర్గల్ మండలం వేలూరులో గురువారం సాయంత్రం జరిగింది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి, కుటుంబీకులు తెలిపిన ప్రకారం.. వర్గల్ మండలం వేలూరుకు చెందిన బడుగు నాగరాజు, వజ్రమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకొడుకు బడుగు హరికృష్ణ(26) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రూ. 4 లక్షలు కడితే ప్రతినెల రూ.15,000 చెల్లిస్తామని ‘క్యూనెట్’ అనే మల్టీలెవల్ మార్కెటింగ్, ఫైనానన్స్ కంపెనీ వారి మాటలు నమ్మాడు. తెలిసిన వారి వద్ద రూ. 4 లక్షలు అప్పుచేసి క్యూనెట్ కంపెనీలో చెల్లించాడు. కంపెనీ వారు చైన్‌లింక్‌గా మరో వ్యక్తితో మరో రూ. 4 లక్షలు కట్టిస్తే నీకు నెలకు రూ.15,000 వస్తాయని చెప్పటంతో ఖంగుతిన్నాడు. తాను మోసానికి గురయ్యానని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సంవత్సరం క్రితం కూడా హరికృష్ణ బెట్టింగ్ యాప్‌లో రూ.10 లక్షల వరకు నష్టపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా ‘క్యూనెట్’ సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయానని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. జీవితంలో తాను చేసిన ఏ పని కలిసిరావడం లేదని తీవ్ర మనస్తాపంతో సూసైడ్ లెటర్ రాసి గురువారం సాయంత్రం తన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొనగా మృతుని తండ్రి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.