
విద్యుదాఘాతంతో రైతుకు తీవ్రగాయాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో ఓ రైతుకు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని రామవరంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆరె గట్టయ్య (50) తన వ్యవసాయ పొలంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మరమ్మతు చేసే క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఎక్కాడు. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. వెంటనే స్థానిక రైతులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ప్రమాదంలో గట్టయ్య చేతికి, కాలు, శరీరం భాగంలో తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కినట్లు అధికారులు చెబుతున్నారు.