
వేగంగా ఇళ్ల బిల్లులు మంజూరు
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,కస్తూర్బా పాఠశాలల తనిఖీ
కొండాపూర్(సంగారెడ్డి): ఎలాంటి జాప్యం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరవుతున్నాయని, లబ్ధిదారులు కూడా తమ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకా ఫోటో అప్‌లోడ్ చేయనవి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలని హౌసింగ్ ఏఈ లను ఆదేశించారు. మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్భా పాఠశాలలతోపాటు ఇందరిమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో, ఔట్ పేషంట్, ఇన్ పేషంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనరల్‌వార్డును పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామాలలో జ్వర సర్వేలు నిర్వహించాలని ఆదేశించారు. మురుగునీరు గ్రామాల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కేజీబీవీని సందర్శించి...
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల, సామాగ్రి భద్రపరిచే గది, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలను సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందన్నారు. మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యమైన నిత్యవసర సరుకులు, తాజా కూరగాయలను వినియోగించాలని, వంట సిబ్బంది పరిశుభ్రత నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రంమలో ఎంపీడీఓ వేణు గోపాల్, తహసిల్దార్ అశోక్,, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి