● నీట మునిగిన పంటలు ● పొంగి పొర్లిన వాగులు, వంకలు
సంగారెడ్డి జోన్/పటాన్‌చెరు: జిల్లాలోని పలుచోట్ల మరోసారి భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రాత్రి సమయంలో భారీ వర్షం కురవడంతో రహదారులపై రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంతోపాటు జహీరాబాద్, ఝరాసంగం, పటాన్‌చెరు, సదాశివపేట, రామచంద్రపురం ప్రాంతాలలో అత్యధికంగా వర్షం కురిసింది. 9.5 సెంటీమీటర్లతో రామచంద్రపురంలో అత్యధికంగా నమోదైంది. ఝరాసంగంలోని కేతకీ ఆలయం ముందు ఉన్న వాలద్రి వాగు, ప్యారవరం, మెదపల్లి వాగులు పొంగి పొర్లాయి. సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పంట పొలాల్లో పూర్తిగా వర్షపునీరు నిలిచిపోయింది. నారింజ వాగు, నిమ్జ్ రహదారి పక్కనే ఉన్న పంట పొలాల్లో నుంచి వరద నీరు ప్రవహించింది.
ఇళ్లలోకి వరద
అమీన్‌పూర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన దుర్గా హోమ్స్, సెంథన్, టీచర్స్ కాలనీల్లో వరద ఇళ్లలోకి చేరింది. వరదతోపాటు డ్రైనేజీ నీరు ఆ కాలనీవాసులను తీవ్ర ఇబ్బందులకు లోను చేసింది. కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు సమచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. కమిషనర్ జ్యోతిరెడ్డి బుధవారం అర్ధ రాత్రి వరకు కాలనీలోనే ఉండి కాలనీవాసులకు భరోసా కల్పించారు.