
సింగూరుకు 62,336 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు నుంచి మంగళవారం వరద జలాలను విడుదల చేశారు. ఎగువ భాగం నుంచి 62,336 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఆరు గేట్లు ఎత్తి 63,906 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
అర్హులందరికి రేషన్ కార్డులు
ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి
కల్హేర్(నారాయణఖేడ్): రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. మంగళవారం కల్హేర్‌లో లబ్ధిదారులకు కొత్తగా రేషన్‌కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా నెరవేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివ శ్రీనివాస్, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ భాస్కర్‌సేట్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోచయ్య, నాయకులు తుకరాం, దేవదాస్, వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన
అవసరం: సౌజన్య
పటాన్‌చెరు టౌన్: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం బీరంగూడ లోని శక్తి సదన్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్య, వృత్తి నైపుణ్యాలు, అభివృద్ధి ద్వారా సమాజంలో తమ స్థానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, రక్షణ పథకాలు సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, శక్తి సదన్ హోమ్స్ ఇన్‌చార్జి సుజాత తదితరులు పాల్గొన్నారు.
కార్మికశాఖ సహాయ అధికారి సస్పెన్షన్
నారాయణఖేడ్: అవినీతి, ఆరోపణలపై నారాయణఖేడ్ సహాయ కార్మికశాఖ అధికారి గిరిరాజ్, ఆయనకు సహకరించిన జూనియర్ అసిస్టెంట్ సాయిలు, అటెండర్ నర్సింహులును సస్పెండ్ చేశారు. పలువురు కార్మికుల ఫిర్యాదులపై ఉమ్మడి జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రావు జూలై నెలలో విచారణ జరిపారు. నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా కార్మికశాఖ అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. కార్మికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వికారాబాద్ జిల్లా నుంచి యాదయ్యను ఇన్‌చార్జి సహాయ కార్మిక శాఖ అధికారిగా నియమించారని తెలిపారు.
క్రీడలతో మానసికోల్లాసం
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మాణయ్య
జోగిపేట(అందోల్): క్రీడలతో క్రమశిక్షణ, మానసికోల్లాసానికి దోహదపడతాయని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.మాణయ్య, మండల విద్యాధికారి బి.కృష్ణ అన్నారు. మంగళవారం జోగిపేటలోని ఎన్‌టీఆర్ మైదానంలో మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిలుగా విచ్చేసి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు క్రీడాపోటీలు అవసరమన్నారు. భవిష్యత్‌లు ఎస్‌జీఎఫ్ సర్టిఫికేట్లు ఉపయోగపడతాయని చెప్పారు. క్రీడాకారులు క్రీడాస్పూర్తితోనే క్రీడలు ఆడాలని, గెలుపోఓటములు సహజమేనని వివరించారు. పీఆర్టీయూ మండలశాఖ అధ్యక్షుడు నరోత్తంకుమార్, అసోసియేట్ అధ్యక్షుడు మంజ్యానాయక్, జి.అనిల్‌కుమార్, జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్, రాష్ట్ర అసోసియేట్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సింగూరుకు 62,336 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో