పద్మ చావుకు కారణమెవరు? | - | Sakshi
Sakshi News home page

పద్మ చావుకు కారణమెవరు?

Jun 30 2025 7:50 AM | Updated on Jun 30 2025 7:50 AM

పద్మ

పద్మ చావుకు కారణమెవరు?

నిధుల గోల్‌మాల్‌లో పాత్రదారులెవరో..

దాదాపు రూ.85 లక్షల కుంభకోణం

బయటకు రాని బ్యాంకుఅధికారుల లీలలు

బలవుతున్న అమాయకులు

పాపన్నపేట(మెదక్‌): ‘వీఓఏ ఉద్యోగం చివరకు నా ప్రాణం మీదకు తెచ్చింది. బ్యాంకు, సెర్ప్‌ అధికారులు, తోటి ఉద్యోగులు కలిసి నా చావుకు కారణమయ్యారు. నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని, నా ద్వారా డబ్బులు తీసుకున్నారు. చివరకు నన్ను దోషిగా నిలబెట్టారు. ఇంత జరిగినా ఇంకా చచ్చిపోలేదా? అన్నట్లు కొందరు నిలదీస్తుంటే ఎలా బతకాలి. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నా. కలెక్టర్‌ గారు నా చావుకు కారణమైన వారిని మాత్రం వదలొద్దు. విచారణ జరిపి, నిందితులను గుర్తించి, నా ఆత్మకు శాంతి కలిగించండి’ అంటూ చివరిసారి లేఖ రాసి..ఉరి తాడుకు వేలాడింది.. పొడిచన్‌పల్లి వీఓఏ పద్మ.

కానరాని అధికారులు

పొడిచన్‌పల్లి వీఓఏ పద్మ ఆర్థిక నిందలు భరించలేక ఆత్యహత్య చేసుకొని 5 రోజులైంది. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని చివరి కోరిక కోరుతూ.. లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఇంత వరకు ఒక్క అధికారి కూడా కనీసం వారి ఇంటికి వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. 18 ఏళ్లు సేవ చేసినా కనీసం సానుభూతి కరువైంది. చివరకు వాట్సాప్‌ గ్రూపుల్లో సైతం ఆమె పేరును తొలగించి, జ్ఞాపకాలు సైతం చెరిపేశారని కొందరు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

నిధుల గోల్‌మాల్‌లో పాత్రదారులెవరు!

పొడిచన్‌పల్లి గ్రామ సమాఖ్య పరిధిలో కొంత కాలం నుంచి జరిగిన సుమారు రూ.85 లక్షల కుంభకోణం రెండు నెలల క్రితం బయట పడింది. ఇందులో వీఓఏ పద్మతో పాటు బ్యాంకు అధికారులు, సెర్ఫ్‌ ఉద్యోగులు, సహచరుల పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. కాగా తూతూ మంత్రంగా విచారణ జరిపిన అఽధికారులు సీసీని సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వస్తున్నా యి. అయితే సీ్త్రనిధి నుంచి నెలనెలా వస్తున్న రుణ రికవరీల డబ్బును కొంత మంది బ్యాంకు, సెర్ఫ్‌ అధికారులు వాడుకొని.. వాటిని చెల్లించడానికి డ్వాక్రా సంఘాల పేరిట సభ్యులకు తెలియకుండా రుణాలు తీసుకున్నారు. వాటిని పద్మ ద్వారా మళ్లించి, సీ్త్రనిధికి జమ చేశారని పద్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నుంచి కూడా 18 చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేయించి పద్మను బలిచేశారని వాపోతున్నారు. అసలు డ్వాక్రా రుణాలు మొదట గ్రూపు ఖాతాలోకి, తర్వాత సభ్యుల బ్యాంకు ఖాతాలోకి వెళ్లాల్సి ఉండగా, అధికారుల ప్రమేయం లేకుండా పద్మ ఎలా కాజేస్తుందని ప్రశ్నిస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నిధులు సైతం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి సంతకాలు లేకుండా ఆమె ఎలా మళ్లించుకుంటుందని అడుగుతున్నారు.

పద్మ మరణానికి కారకులెవరు?

డ్వాక్రా సంఘాల నిధుల గోల్‌మాల్‌లో ‘తిలా పాపం తలా పిడికెడు’అన్న చందంగా బ్యాంకు, సెర్ప్‌, తోటి ఉద్యోగుల పాత్ర ఉందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిధుల గోల్‌మాల్‌ బయట పడగానే అధికారులంతా పద్మను బాధ్యురాలిని చేస్తూ నిధుల రికవరీ కోసం ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. మరో వైపు కొంత మంది గ్రామస్తుల అవమానకర మాటలు, సంఘ సభ్యుల శాపనార్థాలు ఆమెను కుంగదీశాయని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర లేని డబ్బులు ఎలా చెల్లించాలనే ఆందోళన ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాయని అంటున్నారు.

బాఽధ్యులను గుర్తించి శిక్షించాలి

అమ్మ చివరి కోరిక మేరకు డ్వాక్రా రుణాల గోల్‌మాల్‌పై పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరపండి. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోండి. మాకు అప్పులు తప్ప ఆస్తులు లేవు. మా అమ్మ అన్ని డబ్బులు తీసుకుంటే మా భూములు ఎందుకు అమ్ముకుంటాం. పెంకుటింట్లో ఎందుకు నివసిస్తాం. మేము చదివింది సర్కార్‌ బడిలోనే. మా అమ్మ చనిపోయి 5 రోజులు అయ్యింది. కనీసం చివరి కోరికకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. పోయిన మా అమ్మను తెచ్చి ఇవ్వకున్నా, పోయిన పరువును కూడగట్టుకోవాలని పరితపిస్తున్నాం.

– నవీన్‌ రెడ్డి (మృతురాలి కొడుకు)

పద్మ చావుకు కారణమెవరు?1
1/2

పద్మ చావుకు కారణమెవరు?

పద్మ చావుకు కారణమెవరు?2
2/2

పద్మ చావుకు కారణమెవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement