
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్య
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సమాజంలో దోపిడీ అణచివేత పోవాలన్నా, సమసమాజం రావాలన్నా అది కేవలం మార్కిస్ట్ సిద్ధాంతంతోనే సాధ్యమని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య స్పష్టం చేశారు. సంగారెడ్డిలో ఆదివారం కేవల్‌కిషన్ భవన్‌లో సీపీఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ...సమాజంలో సామాజిక అసమానతలు, మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కులాల పేరిట, మతాల పేరిట విద్వేషాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం సామాన్య ప్రజలకు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజ య్య, మల్లేశం, మాణిక్ తదితరులు పాల్గొన్నారు.