
ఖేడ్‌లో నవోదయ ఏర్పాటుకు కృషి
ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఖేడ్‌లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983–84లో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల మిత్ర సోషల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కళావేదికను శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆందోల్ నవోదయ విద్యాలయం కోసం మంత్రి దామోదర, తన నియోజకవర్గంలో ఏర్పాటుకు ఎంపీ రఘునందన్‌రావు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. అయినా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. తామూ ఈ పాఠశాలలోనే చదువుకున్నామని, పాఠశాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులను సమీకరిస్తామన్నారు. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించారు. రూ.40 లక్షలతో అవసరమైన పరికరాలున్న కొత్త అంబులెన్స్‌ను సమకూరుస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. వెద్యుల సమస్యలు పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. కోటి మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ సంగారెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.