
మతోన్మాదుల కుట్రలు తిప్పికొట్టాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రవికుమార్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి సోషలిజం, సెక్యులర్ పదాలను తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రకటించిన వైఖరి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండా రవికుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో నాయకత్వ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. భారతదేశం మత రాజ్యం కాకూడదని, అభివృద్ధి చెందిన దేశాల సరసన పోటీ పడాలని రాజ్యాంగ స్ఫూర్తి వెల్లడిస్తుందన్నారు. దేశాన్ని మత రాజ్యంగా మార్చాలని మతోన్మాద శక్తులు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలందరూ తమకు నచ్చిన మతాన్ని ఆచరిస్తూనే లౌకిక భావనతో పరమత సహనాన్ని కోరుకుంటున్నారన్నారు. ప్రజల మధ్య అనైక్యతను సృష్టించి మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు, రాంచందర్, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, రేవంత్, నాగేశ్వర్ రావు, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.