
తాగునీటి సమస్య తలెత్తొద్దు
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధి కారులకు సూచించారు. శనివారం క్యాంపు కార్యా లయంలో మంజీరా బ్యారేజీ, సింగూర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌కు సరఫరా అవుతున్న తాగునీటి వివరాలను, మంజీరా బ్యారేజ్ పరిస్థితి, నారింజ వాగు, సింగూర్ పరివాహాక ప్రాంతం వివరాలు, నూతనంగా చేపట్టిన చెరువులు, కుంటల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఝరాసంఘం, న్యాల్కల్ మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని గురుకుల సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని లీకేజీలకు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మిషన్ భగీరథ డీఈ రఘువీర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.