
కార్పొరేట్‌కు దీటుగా నిల‘బడి’న వైనం
● సత్ఫలితాలనిచ్చిన ‘బడిబాట’ కార్యక్రమం ● ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న ప్రవేశాలు ● దాతల వితరణ, టీచర్ల ప్రత్యేక కృషితో బడిలో చేరేందుకు మొగ్గు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు జోరందుకున్నాయి. అడ్మిషన్లు పెంచేందుకు అటు ప్రభుత్వం తీసుకున్న చర్యలతోపాటు ఇటు సదరు పాఠశాలల ఉపాధ్యాయులు ‘బడిబాట’పేరుతో చేసిన విస్తృత ప్రచారం సత్ఫలితాలనిచ్చింది. ఇదే ఊపును కొనసాగిస్తే జూలై చివరాఖరి వరకు ప్రవేశాలకు ఇంకా సమయం మిగిలి ఉండటంతో ప్రభుత్వం నిర్దేశించిన ప్రవేశాల లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. ప్రభుత్వ బడుల్లో దాతల వితరణలతో మెరుగుపడిన మౌలిక వసతులు, విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు, పెన్నులు, స్కూల్ బ్యాగ్‌లు ఉచిత పంపిణీ వంటి అంశాలు అడ్మిషన్లు పెరిగేందుకు ఎంతగానో దోహదపడ్డాయి.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఇందులో మొదటి వరుసలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొదటి వరుసలో ఉంటుంది. ఈ పాఠశాల అంటే విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంత క్రేజ్ అంటే...ఈ ఏడాది ఆరో తరగతిలో 180 సీట్లు ఉండగా 150 సీట్లు కాంప్లెక్స్ పాఠశాల పరిధిలోని విద్యార్థులకు కేటాయించగా...మిగిలిన 30 సీట్లకోసం ఏకంగా 340 దరఖాస్తులు వచ్చాయి. అందుకే ఈ పాఠశాలలో ప్రతీ ఏటా నో అడ్మిషన్ బోర్డు పెడుతుంటారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 1,217 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
ప్రత్యేకత ఏమిటి?
ఈ పాఠశాలలో పుస్తకాల్లోని చదువు మాత్రమే కాకుండా సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తారు. డిజిటల్ విద్యా బోధన, గ్రంథాలయం, క్రీడాప్రాంగణం, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సీటీ) ఆధ్వర్యంలో వివిధ భాషలలో శిక్షణ, కవిత్వం, ఆర్థిక, సామాజిక, తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. పాఠశాలకు సంబంధించిన నిర్వహణ మొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు పోటీలు పడుతున్నారు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): విద్యార్థులు పోటీపడి మరీ బడిలో చేరాలనుకుంటున్న పాఠశాలల్లో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల ఒకటి. ఇందులో చేరాలంటే విద్యార్థులు ముందుగా పరీక్ష రాసి అందులో ప్రతిభ చాటాలి. ఈ స్కూల్‌లో ప్రతీ ఏటా టెన్త్ నూరుకు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తుండటంతోపాటుగా చదువులో వెనుకబడిన విద్యార్థులకు తెల్లాపూర్ నైబర్‌హూడ్ అసోసియేషన్ సహకారంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆధునిక పాఠశాల భవనం, ల్యాబ్, డిటిటల్ తరగతులతో విద్యాబోధన, వారానికి ఒకసారి లైఫ్‌స్కిల్‌పై ప్రత్యేక శిక్షణ, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుండటం ఈ స్కూల్ ప్రత్యేకతలు. దీంతో విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతేడాది 410మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 545 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టినప్పటికీ తమ పిల్లలకు ప్రవేశం కోసం వివిధ మార్గాల ద్వారా రికమండేషన్స్ చేయిస్తున్నారు.
మోడల్ స్కూల్ లో అడ్మిషన్లు ఫుల్
ఝరాసంగం(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా ఝరా సంగం మండలంలోని మోడల్ స్కూల్‌లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధనతోపాటు వృత్తి విద్యా బోధన కూడా చేస్తుండటంతో విద్యార్థులు ఈ ప్రభుత్వ బడిలో చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఈ పాఠశాలలో బోధిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో ఈ స్కూల్‌లో అడ్మిషన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.
లక్ష్యానికిపైగా కస్తూర్బాలో అడ్మిషన్లు
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో లక్ష్యానికిపైగా అడ్మిషన్లు ఉన్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పదో తరగతిలో 100% ఫలితాలు సాధిస్తుండటంతో 208 మంది బాలికలు వసతిగృహంలో ఉండి చదువుకుంటున్నారు.
సర్కారీ స్కూళ్లకు సలామ్..!
ప్రత్యేక శ్రద్ధతో పెరిగిన ప్రవేశాలు
న్యాల్‌కల్(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండల పరిధిలోని మామిడ్గి ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. గతేడాది 129 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 140కి పైగా విద్యార్థులు ఉండటమే ఇందుకు నిదర్శనం. ఈ బడిలో టీచర్లతోపాటు దాతల సహకారంతో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ప్లేట్లు, పెన్నులు, బ్యాగ్‌లు వంటి వాటిని ఉచితంగా అందిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ బడిలో చేర్పేంచేందుకు ముందుకు వస్తున్నారు. ఇక డప్పూర్ పాఠశాలలో హెచ్‌ఎం జావీద్ ఉపాధ్యాయుల బృందంతో కలిసి ఇల్లిల్లు తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అవగాహన కల్పించారు. దీంతో ఈ ఏడాది ప్రవేశాలు పెరిగాయి. గతేడాది 70 మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం 110 విద్యార్థులు చేరారు. ఇక హద్నూర్ పాఠశాలలో ఈ ఏడాది కొత్తగా 40 మందికి పైగా విద్యార్థులు చేరారు.
అదనంగా గంట సేపు బోధన
నర్సాపూర్ రూరల్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్‌పూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధపెట్టి చదివిస్తుండటంతోపాటు ఆట పాటలు, సంస్కృతి సంప్రదాయాలను కూడా బోధిస్తుండటం గ్రామస్తుల్ని బాగా ఆకర్షించింది. పైగా ఈ గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకన్నా ఈ బడిలో చదివిన విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారు. దీంతో తమ పిల్లలను ఈ స్కూల్‌లోనే చేర్పించారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివకుమార్ అదనంగా గంట సమయాన్ని కేటాయించి పాఠాలు బోధించేలా చేశారు. ఉపాధ్యాయులు సొంత డబ్బులతోపాటు దాతల సహకారంతో విద్యార్థులకు అవసరమైన టై, బెల్టులు, గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీనెల స్లిప్ టెస్టులు పెడుతూ సీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బోధిస్తున్నారు. దీంతో గతేడాది 1 నుంచి 5వ తరగతి వరకు 33 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసించగా...ప్రస్తుతం 65 మంది విద్యనభ్యసిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఆరోవ తరగతి వరకూ అప్‌గ్రేడ్ చేస్తూ అధికారులు ప్రాథమికోన్నత పాఠశాలగా ప్రకటించారు.

కార్పొరేట్‌కు దీటుగా నిల‘బడి’న వైనం

కార్పొరేట్‌కు దీటుగా నిల‘బడి’న వైనం

కార్పొరేట్‌కు దీటుగా నిల‘బడి’న వైనం

కార్పొరేట్‌కు దీటుగా నిల‘బడి’న వైనం

కార్పొరేట్‌కు దీటుగా నిల‘బడి’న వైనం