
పోలీసుల అదుపులో కొమురవెల్లి చోరీ నిందితుడు!
కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలో ఇటీవల జరిగిన చోరీకి సంబంధించిన నిందితుడిని కొమురవెల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన నిందితుడు కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చి పక్కగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని పోతుగంటి కొమురవెల్లి ఇంట్లో బుధవారం చోరీ జరిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యా దు చేసిన విషయం తెలిసిందే. అయితే విషయమై ఎస్‌ఐ రాజును వివరణ కోరగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.
బంధువుల ఇంటికి వెళ్తూ...
బైక్ అదుపుతప్పి కొడుకు మృతి
తల్లికి తీవ్ర గాయాలు
హత్నూర(సంగారెడ్డి): బంధువుల ఇంటికి వెళ్తూ బైక్ అదుపుతప్పడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలవగా అతడి తల్లి తీవ్రంగా గాయపడింది. హత్నూర మండలం గోవిందరాజు పల్లి గ్రామ శివారులో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హత్నూర మండలం సికిందలాపూర్ గ్రామానికి చెందిన కురుమ దానయ్య(42) అతడి తల్లి వీరమ్మతో కలిసి ఉదయం మెదక్ జిల్లా సోమక్కపేటలో ఉండే బంధువుల ఇంటికి బైక్‌పై బయల్దేరారు. సరిగ్గా గోవిందరాజు పల్లి గ్రామ శివారులో చేరుకునేసరికి బైక్ అదుపు తప్పి పక్కనున్న పొదల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో దానయ్య అక్కడికక్కడే మృతి చెందగా వీరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న పశువుల కాపరులు వీరిని చూసి పోలీసులకు సమాచారమివ్వడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వీరమ్మను చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దానయ్య మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
108 అంబులెన్స్‌లో ప్రసవం
తల్లీ బిడ్డా క్షేమం
వర్గల్(గజ్వేల్): గజ్వేల్ మండలంలో ఓ గర్భిణిని ప్రసవం కోసం గాంధీ ఆస్పత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. వర్గల్ మండలం గౌరారం వద్ద శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పిడిచేడ్ గ్రామానికి చెందిన పుల్ల కల్యాణికి నెలలు నిండటంతో పురుటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం గజ్వేల్‌లోని మాతాశిశు సంక్షేమ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకు ఫిట్స్ రావడంతో అక్కడి వైద్యులు గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో శనివారం ఉదయం ఆమెను 108 అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పురుటినొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తమై ఆమెకు ప్రసవం చేశారు. తల్లీ, మగశిశువు క్షేమంగా ఉన్నారని వారిని తిరిగి గజ్వేల్ ఆస్పత్రికి తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.
మద్యం తాగి వ్యక్తి మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని కంచన్‌పల్లిలో శనివారం అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటన వివరాలిలా ఉన్నా యి. కంచన్‌పల్లి గ్రామానికి చెందిన నీలబోయిన నర్సింహులు(48) ప్లంబర్ పనిచేస్తుంటా డు. కాగా మద్యానికి బానిసై భార్య లావణ్య, తల్లి క్యాతమ్మతో గొడవ పడి కొట్టేవాడు. ఈ క్రమంలో శుక్రవారం భార్య, తల్లితో గొడవపడి బయటకు వెళ్లి అతిగా మద్యం తాగాడు. అనంతరం ఇంటికి వచ్చి నిద్రపోయాడు. నర్సింహులును భోజనానికి లేపితే ఎంతకూలేవకపోవడంతో అనుమానమొచ్చిన భార్య తరచి చూడ గా భర్త మృతి చెందినట్లు గుర్తించింది. మృతుడి తమ్ముడు మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పోలీసుల అదుపులో కొమురవెల్లి చోరీ నిందితుడు!