
పొలం తన పేరున కాక.. అప్పులు తీర్చలేక
పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య
హవేళిఘణాపూర్(మెదక్): అప్పు చేసి కొనుగోలు చేసిన పొలం తన పేరున కాకపోవడం, ఇంటి అవసరాలకు చేసిన అప్పులు పేరుకుపోవడంతో జీవితంపై విరక్తి చెందిన రైతు పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం చౌట్లపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చీమల చంద్రయ్య (55) కొంతకాలం క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 20 గుంటల పొలం అప్పు చేసి కొనుగోలు చేశాడు. ఆ పొలం తన పేరున కాకపోవడంతో పలుమార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి పురుగు మందు సేవించాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు కుటుంబీకులకు సమాచారం అందించగా, అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే 108లో మెదక్ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీకి తరలించేలోపే మృతిచెందాడు. పొలం కోసం, ఇంటి అవసరాల కోసం అప్పులు అయ్యాయని బాధపడుతూ ఉండేవాడని, కొనుగోలు చేసిన భూమి కూడా తన పేరునకాకపోవడంతో ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమంలో దరఖాస్తు కూడా సమర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రైతు చంద్రయ్య పేరున పొలం లేకపోవడంతో రైతుబీమా సైతం వర్తించిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
రైలు పట్టాలపై యువతి
తూప్రాన్: రైలు పట్టాలపై యువతి బలవన్మరణంకు పాల్పడిన ఘటన శనివారం పట్టణ సమీపంలోని బ్రహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన శవర్తి నర్సవ్వ, శంకర్ దంపతుల మూడో కూతురు స్వర్ణ(24) కొన్నేళ్లుగా మనోహరాబాద్ మండలం రామాయిపల్లి గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తుంది. ఈ క్రమంలోనే రోజు మాదిరిగా ఉద్యోగానికి వెళ్లిన యువతి ఇంటికి చేరుకుంది. అనంతరం తూప్రాన్‌లో పని ఉందని ఇంటి నుంచి బయల్దేరిన స్వర్ణ బ్రహ్మణపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండగా ఒక్కసారిగా దూకేసింది. దీంతో స్వర్ణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది

పొలం తన పేరున కాక.. అప్పులు తీర్చలేక