
కోనాయిపల్లి గ్రామస్తుల తీర్మానం
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కోనాయిపల్లి(పీబీ) గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేటు స్కూలుకు పంపించవద్దని తీర్మానించుకున్నారు. గ్రామానికి ప్రైవేట్ పాఠశాలల బస్సులు రాకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామంలోని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. ఇదే గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే 20 మందికి పైగా విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరారు.
వాలంటీర్‌కు గ్రామస్తులే వేతనం
గ్రామస్తులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ఒక వాలంటర్‌ను కూడా నియమించి ప్రతీ నెల రూ.5వేల చొప్పున వేతనం గ్రామస్తులే అందిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లిష్‌లో బోధన, ప్రత్యేక యూనిఫాం, వివిధ రకాల క్రీడలు తదితర విభాగాల్లో శిక్షణనిస్తుండటంతో విద్యార్థులు ఈ సర్కారు బడికి ఆకర్షితులయ్యారు.
ఫలించిన బడిబాట
పాఠశాలల పునఃప్రారంభానికి ముందు నుంచే ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణతోపాటు బడిబాట కార్య క్రమం చేపట్టింది. ఉపాధ్యాయులు విద్యార్థులను బడిలో చేర్చుకునేందుకు ఇంటింటా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తుల ద్వారా సత్ఫలితాలు సాధించారు.