
అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించండి
ఎంపీ రఘునందన్‌రావుకు
రుద్రారం గ్రామస్తులు వినతి
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు మండలం రుద్రారం గణేశ్ గడ్డ దేవాలయం వద్ద దేవాలయం సమీపంలో అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించాలని రుద్రారం నాయకులు, గ్రామస్తులు మెదక్ ఎంపీ రఘునందన్ రావును కోరారు. ఈ మేరకు గ్రామస్తులు హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎంపీ రఘునందన్‌రావు అక్కడ అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని స్థానిక నాయకులు తెలిపారు.
నేడు జాబ్‌మేళా
సంగారెడ్డి టౌన్ : జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 28 శనివారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి అనిల్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్, పూస్‌కల్ ఆగ్రో టెక్‌లో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని..టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని చెప్పారు. జిల్లా ఉపాధి కార్యాలయం పాత వెలుగు కార్యాలయంలో జరిగే ఈ మేళాకు సకాలంలో హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వివరాలకు 08455–271010లో సంప్రదించాలని కోరారు.
సమస్యలతోవిద్యార్థుల సతమతం
యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సంక్షేమ హాస్టల్స్‌లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శుక్రవారం హాస్టల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2025 విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థుల హాస్టళ్లలో మాత్రం కనీస వసతులు కల్పించలేదని దీంతో విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. విద్యార్థుల బాగోగులు పట్టించుకోని పక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించి ‘చలో కలెక్టర్’కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు.
టెన్త్ సప్లిమెంటరీఫలితాలు విడుదల
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పది సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జిల్లా లో 195 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా 109 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 117 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 61 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 78 మంది విద్యార్థులకు 48 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా మొత్తంగా ఉత్తీర్ణత శాతం 55.90గా నమోదైంది. రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించి జూలై 7వ తేదీ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతకం చేసిన అప్లికేషన్ ఫారం, హాల్ టికెట్ జిరాక్స్, ప్రింట్ మెమోను జతచేసి పాఠశాలలనే సమర్పించాని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
నేడు ఆస్పత్రి
అభివృద్ధి సమావేశం
నారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రి సలహా సంఘం సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.జి.రమేశ్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆస్పత్రి సమావేశ మందిరంలో మధ్యా హ్నం 2గంటలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి సభ్యులు విధిగా హాజరు కావాలని కోరారు.
రైతుఖాతాల్లో
రూ.113,37 కోట్లు జమ
జహీరాబాద్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు భరోసా పథకం కింద జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని రైతులకు రూ.113.37 కోట్ల నిధులు జమ అయినట్లు ఏడీఏ భిక్షపతి శుక్రఓవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.