
ఘనంగా జగన్నాథ రథయాత్ర
సంగారెడ్డి టౌన్: పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగన్నాథ రథయాత్ర శుక్రవారం ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. పట్టణంలోని నటరాజ్ థియేటర్ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. పూరీ జగన్నాథుని రథయాత్రను అందంగా అలంకరించి, భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ కోలాటం ఆడుతూ ఆనందోత్సవాల మధ్య రథయాత్ర కొనసాగింది. రథయాత్రలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్ పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. నేటి యువతరానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళలు, ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.